TRINETHRAM NEWS

Trinethram News : సాధారణంగా క్రికెట్‌లో ఓవర్‌త్రో ద్వారా బౌండరీకి వెళ్తే.. అప్పటికే చేసిన పరుగులకు ఆ బౌండరీని జోడిస్తారు. ఆ బంతిని ఎదుర్కొన్న బ్యాటర్‌ ఖాతాలో ఈ పరుగులు జమ చేస్తారు. ఒకవేళ బంతి బ్యాట్‌కు తాకినప్పుడే ఈ నిబంధన వర్తిస్తుంది. లేకపోతే అవి అదనపు పరుగుల రూపంలో వస్తాయి. కానీ, భారత్‌, ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో విభిన్న పరిస్థితి ఎదురైంది. ఓవర్‌త్రో ఫోర్‌గా వెళ్లి బ్యాటర్‌ రెండు పరుగులు చేసినా ఐదు పరుగులే ఇచ్చారు.
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 47వ ఓవర్‌ బుమ్రా వేశాడు. ఫుల్‌టాస్‌గా వచ్చిన చివరి బంతిని రెహన్ అహ్మద్‌ ఫ్లిక్‌ చేసి రెండు పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే ఫీల్డర్ త్రో విసరగా బంతి బ్యాకప్‌ ఫీల్డర్‌ని దాటుకుని బౌండరీకి వెళ్లింది. తొలుత అంపైర్‌ ఆరు పరుగులు ఇచ్చాడు. అనంతరం అంపైర్‌ తన నిర్ణయాన్ని మార్చుకుని రెహన్‌ ఖాతాలో ఐదు పరుగులే చేరుస్తున్నట్లు ప్రకటించాడు. ఫీల్డర్‌ బంతిని త్రో విసిరే సమయానికి ఇద్దరు బ్యాటర్ల ఎండ్‌ మారకపోవడంతో ఐదు పరుగులే ఇచ్చాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ల మధ్య జరిగిన 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. అప్పుడు కూడా బ్యాటర్ల ఎండ్ మారకపోవడంతో ఐదు పరుగులే ఇచ్చారు. 
ఇక.. భారత్, ఇంగ్లాండ్‌ మధ్య మొదటి టెస్టు విషయానికొస్తే.. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పర్యాటక జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు ఎనిమిది వికెట్లు పడగొట్టారు. అశ్విన్‌, జడేజా తలో మూడు వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి రోజు ఆట ముగిసేసరికి భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 23 ఓవర్లలో 119 పరుగులు చేసింది. క్రీజ్‌లో యశస్వి జైస్వాల్ (76 నాటౌట్: 70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్ (14*) ఉన్నారు