హెల్మెట్ ధరించడం ప్రతి ద్విచక్ర వాహనదారుడి బాధ్యత.
జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఐఏఎస్.,
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,..
హెల్మెట్ ధరించండి – జీవితం కాపాడుకోండి.
మీ ప్రాణం… మీ కుటుంబానికి అమూల్యమైనది.
నో హెల్మెట్ – నో పెట్రోల్ అమలు.
హెల్మెట్ అవగాహనకు 700 బైకులతో ఘన ర్యాలీ.
Trinethram News : తిరుపతి జిల్లా : పోలీస్ శాఖ.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ నిరంతరం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లావ్యాప్తంగా.. నో హెల్మెట్ – నో పెట్రోల్.. నిబంధనను కఠినంగా అమలు చేస్తూ, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈరోజు ఉదయం 10.00 గంటలకు, తిరుపతి జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుండి ప్రకాశం రోడ్డులోని జిల్లా ఎస్పీ కార్యాలయం వరకు హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 700 ద్విచక్ర వాహనాలు పాల్గొని ప్రజలకు బలమైన సందేశాన్ని అందించాయి.
ఈ అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్రీ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మరియు జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ స్వయంగా బైక్ నడపగా, జిల్లా కలెక్టర్ హెల్మెట్ ధరించి వెనుక కూర్చుని ర్యాలీలో పాల్గొనడం ద్వారా ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఐఏఎస్., మాట్లాడుతూ, నేటి యువత వేగం, నిర్లక్ష్యం కారణంగా ద్విచక్ర వాహన ప్రమాదాల్లో ప్రాణ నష్టం అధికంగా జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. హెల్మెట్ ధరించడం వల్ల తీవ్రమైన ప్రమాదాల్లోనూ ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. హెల్మెట్ చట్ట భయంతో కాదు కుటుంబ భవిష్యత్తు కోసం ధరించాలి అని స్పష్టం చేశారు. మీ ఒక్క నిర్లక్ష్య నిర్ణయం మీ తల్లిదండ్రుల కన్నీళ్లకు కారణం కావచ్చు. మీ ఒక్క మంచి నిర్ణయం వారి జీవితానికే భరోసా అవుతుంది అని యువతను ఉద్దేశించి భావోద్వేగంగా పిలుపునిచ్చారు. ప్రతి యువకుడు తన స్నేహితులకు కూడా హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఆదర్శంగా నిలవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం పోలీసుల కోసం కాదని, అది పూర్తిగా మీ ప్రాణాల రక్షణ కోసమేనని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో అత్యధికంగా 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతే ఉంటున్నారని, వీరిలో చాలామంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.హెల్మెట్ ఒక భారంలా అనిపించవచ్చు.. కానీ అదే మీ జీవితానికి రక్షణ కవచం అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ ISI మార్కు ఉన్న హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి అని, వాహనంపై వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టంగా చెప్పారు. పోలీసుల లక్ష్యం జరిమానాలు విధించడం కాదని, రోడ్డు ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సోషల్ మీడియా రీల్స్, వీడియోల కోసం నిర్లక్ష్యంగా బైక్ నడపకుండా యువత తమ జీవిత విలువను గుర్తించాలన్నారు. మీ స్నేహితుడు హెల్మెట్ లేకుండా బైక్ ఎక్కితే అతడిని ఆపడం – అదే నిజమైన స్నేహం అని పేర్కొన్నారు.
ఈ బైక్ ర్యాలీ పోలీస్ పరేడ్ గ్రౌండ్ అన్నమయ్య సర్కిల్, ఎం.ఆర్.పల్లి సర్కిల్, బాలాజీ కాలనీ మీదుగా సాగి, ప్రకాశం రోడ్డులోని జిల్లా ఎస్పీ కార్యాలయం వద్ద ముగిసింది. ర్యాలీ మార్గమంతా ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో స్పందిస్తూ హెల్మెట్ అవగాహన సందేశాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు రవి మనోహర్ ఆచారి (శాంతి భద్రతలు) ,నాగభూషణం (క్రైమ్) శ్రీనివాసులు ఏఆర్) ,డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, పోలీస్ అధికారులు, సిబ్బంది, శాంతి భద్రతల విభాగం మరియు ఇతర విభాగాల సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


