త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి.. జిల్లాలో జరగబోయే మొదటి దశ ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను పర్యవేక్షించడానికి మరియు ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఐపీఎస్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, పౌరులందరూ ఎటువంటి భయం లేకుండా, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
జిల్లాలో రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌లు, మరియు ట్రబుల్ మంగర్‌లందరినీ ఇప్పటికే బైండోవర్ చేయడం జరిగింది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, లైసెన్స్ పొందిన తుపాకులు, ఇతర ఆయుధాలను పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేసుకునే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులకు, ప్రభుత్వ ఆస్తులకు, లేదా సాధారణ ప్రజలకు ఎవరైనా ఇబ్బందులు కలిగించినా, భయభ్రాంతులకు గురిచేసినా, చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చరించారు. అంతేకాకుండా, ఎన్నికలలో అలజడులు సృష్టించాలనే ప్రయత్నం చేసినా, సామాజిక మాధ్యమాలలో తప్పుడు లేదా విద్వేషపూరిత ప్రచారాలు చేసినా, అటువంటి వారిపై కేసులు నమోదు చేసి, అవసరమైతే షీట్ కూడా ప్రారంభించడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని, పోలింగ్ బూత్‌లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్‌లు, కెమెరాలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్లడం లేదా వాటితో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించడం పూర్తిగా నిషేధం అని తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పేర్కొన్నారు.జిల్లాలోని ప్రజలు ఎటువంటి అనుమానాలు, ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు పోలీస్ అధికారులకు సంపూర్ణంగా సహకరించాలని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపినారు. ఎక్కడైనా అలజడులు లేదా అవాంఛనీయ సంఘటనలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు గమనిస్తే, వెంటనే తమ పరిధిలోని పోలీస్ అధికారులకు లేదా కంట్రోల్ రూమ్‌కు తెలియజేయాలని ఎస్పీ కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


