![](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.11.40-PM.jpeg)
బీర్ల ధరలు 15% పెంపు
ధరల సవరణకు ప్రభుత్వం అనుమతి
రూ.20-30 వరకు పెరిగే అవకాశం
బీర్ల కంపెనీల ఒత్తిడికి తలొగ్గిన సర్కారు
Trinethram News : హైదరాబాద్, ఫిబ్రవరి 11 : మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. బీర్ల ధరలను 15 శాతం పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ పెంపు మంగళవారం నుంచే అమల్లోకి రానున్నది. ధరల నిర్ణయ కమిటీ సూచనల మేరకు రేట్లు పెంచుతున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ధరల పెంపు నిర్ణయంతో ఒక్కో బీరుపై సగటున రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగే అవకాశం ఉన్నదని ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. దీంతో దాదాపు ఐదేండ్ల తర్వాత రాష్ట్రంలో ధరలు పెరుగనున్నాయి. మరోవైపు ధరల పెంపు నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీర్ల కంపెనీల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని మద్యంప్రియులు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన హైడ్రామాను ఉదహరిస్తున్నారు. బీర్ల ధరలు పెంచకపోతే సరఫరా నిలిపివేస్తామని యూబీ గ్రూప్ హెచ్చరించడం, ఆ తర్వాత ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీని వేయడం, ఇప్పుడు ధరలు పెంచడం వంటివన్నీ పథకం ప్రకారమే జరిగాయని ఆరోపిస్తున్నారు. సరిగ్గా ఎండాకాలం ప్రారంభం కాగానే ధరలు పెంచడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండాకాలంలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని, సమయం చూసి దోచుకునేందుకే ప్రభుత్వం బీర్ల ధరలు పెంచిందని మండిపడుతున్నారు.
ఏపీలోనూ ఒకేరోజు?
ఏపీలోనూ సోమవారమే మద్యం ధరలు పెరిగాయి. ఆ రాష్ట్రంలో ధరలను 15 శాతం సవరిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇది యాదృచ్ఛికం మాత్రం కాదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండు రాష్ర్టాలకు చెందిన ‘పెద్ద’ మనుషులు సిండికేట్ అయ్యారని, ఉమ్మడిగానే ధరల పెంపు డ్రామా ఆడి అమలు చేశారని ఆరోపిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం ఆదాయంపై కన్నేసిందని అంటున్నారు.
ఇందులో భాగంగానే కొత్త బ్రాండ్ల బీర్లను ప్రవేశపెట్టాలని చూసిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అయితే ఆ విషయం రచ్చ కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రభుత్వానికి ఆదాయం పడిపోతున్నకొద్దీ మద్యం అమ్మకాలపైనే దృష్టి పెట్టిందని, ఎక్సైజ్ అధికారులకు జిల్లాలు, స్టేషన్ల వారీగా టార్గెట్లు పెట్టి అమ్మించిందని చెప్తున్నారు. ప్రతి వారం సమీక్షలతో టార్గెట్లు చేరుకునేలా ఒత్తిడి చేసిందని, ఇప్పుడు ధరల పెంపు రూపంలో మందుబాబులను దోచుకునేందుకు సిద్ధమైందని అంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
![Beer prices increased by](https://trinethramnews.in/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-11-at-12.11.40-PM.jpeg)