రాష్ట్రపతి భవన్ లో మోగనున్న పెళ్లి బాజాలు
భవన్ చరిత్రలోనే తొలిసారి, ఉద్యోగి వివాహానికి ప్రత్యేక అనుమతిచ్చిన ప్రెసిడెంట్ ముర్ము.. ఈ నెల 12న రాష్ట్రపతి భవన్ పీఎస్ వో పూనమ్ గుప్తా వివాహం.. వరుడు సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అవనీశ్ కుమార్.. మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్‌లో వివాహ వేడుకలు
Trinethram News : Delhi : రాష్ట్రపతి భవన్ చరిత్రలో తొలిసారి ఓ ఉద్యోగి వివాహానికి భవన్ వేదిక కానుంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతాధికారి (పీఎస్ వో) గా విధులు నిర్వహిస్తున్న సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం జరుపుకునేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేక అనుమతిచ్చారు. దీంతో ఈ నెల 12న పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్ లోని మదర్ థెరిస్సా క్రౌన్ కాంప్లెక్స్ లో జరగనుంది. జమ్మూకాశ్మీర్ లో సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా సేవలందిస్తున్న అవనీశ్ కుమార్ తో పూనమ్ గుప్తా ఏడడుగులు వేయనున్నారు.
వరుడు కూడా సీఆర్ పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ కావడంతో రాష్ట్రపతి ఈ ప్రత్యేక అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల దృష్ట్యా ఈ వివాహ వేడుకకు అతికొద్దిమంది బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే ఆహ్వానం అందినట్లు సమాచారం. కాగా, మధ్యప్రదేశ్ కు చెందిన పూనమ్ గుప్తా 2018లో యూపీఎస్సీ నిర్వహించిన సీఏపీఎఫ్ పరీక్షలో 81వ ర్యాంక్ సాధించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకల్లో సీఆర్ పీఎఫ్ మహిళా దళానికి పూనమ్ గుప్తా సారథ్యం వహించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App