ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రాయాల్సిందే.. వచ్చే ఏడాది నుంచి రద్దు
ఏపీ ఇంటర్ బోర్డు రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా ప్రకటించారు. అయితే ఆ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధులకు పరీక్షలు యథాతథంగా నిర్వహించనున్నారు..
Trinethram News : అమరావతి : తాజాగా ఇంటర్మీడియట్ విద్యామండలి కొత్తగా ప్రతిపాదించిన సంస్కరణల గురించి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు స్పష్టం చేసింది. పబ్లిక్ పరీక్షలకు బదులుగా అంతర్గత పరీక్షల విధానం వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు అమల్లోకి వస్తుందని ఇంటర్ బోర్డు పేర్కొంది. అయితే ఈ ఏడాది మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, విద్యార్ధులందరూ పరీక్షలకు సిద్ధమవ్వాలని సూచించింది.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంతర్గత పరీక్షల విధానం ఎలా ఉంటుందంటే..
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో కళాశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత కావల్సి ఉంటుంది. అయితే ఈ మార్కులను ప్రామాణికంగా తీసుకోరు. నైతికత-మానవ విలువలు, పర్యావరణం పరీక్షలు యథాతథంగా ఉంటాయి. వీటిలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు సూచనలతో మార్పులు చేయనున్నారు. కళాశాల స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో సైతం భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, జీవశాస్త్రానికి 30 మార్కుల చొప్పున ప్రాక్టికల్స్ యథాతథంగా జరుగుతాయి. మిగతా అన్ని సబ్జెక్టులకు 20 ఇంటర్నల్ మార్కులు ఉంటాయి.
కొత్త విధానం ప్రకారం ఇంటర్ సెకండ్ ఇయర్‌లో ఒక్క ఏడాది మాత్రమే ఇంటర్ బోర్డు పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ విధానం 2026-27 విద్యా సంవత్సరంలోనే అమల్లోకి వస్తుంది. వచ్చే ఏడాది 2025-26లో ఇంటర్ ఎన్‌సీఈఆర్టీ పాఠ్యప్రణాళికకు అనుగుణంగా కొంత సిలబస్ తగ్గిస్తారు. అయితే పరీక్షలు మాత్రం పాత విధానంలోనే జరుగుతాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్‌తోనే పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రస్తుతం గణితం ఏ, బీ పేపర్లుగా 75 చొప్పున 150 మార్కులకు ఉండగా.. రెండింటినీ కలిపి కొత్త పద్ధతిలో వంద మార్కులకు పబ్లిక్ పరీక్ష ఉంటుంది. అలాగే బైపీసీలో ప్రస్తుతం జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం సబ్జెక్టులు విడివిడిగా ఉండగా.. ఈ రెండూ కలిపి 50 చొప్పున 100 మార్కులకు ఉంటాయి. ఈ రెండింటినీ కలిపి జీవశాస్త్రంగా పరిగణిస్తారు. అంతేకాకుండా ప్రస్తుతం పబ్లిక్ పరీక్షల్లో ఒక మార్కు ప్రశ్నలు లేవు. కొత్త విధానంలో 10 శాతం వరకు ఒక మార్కు ప్రశ్నలు ఇవ్వనున్నారు. 8 మార్కుల ప్రశ్నలు తొలగించి 5 లేదా 6 మార్కుల ప్రశ్నలు ప్రవేశపెట్టనున్నారు.
నచ్చిన సబ్జెక్ట్ చదివే వెసులుబాటు కూడా..
గణితంతో బైపీసీ చదివే సదుపాయం విద్యార్థికి లభిస్తుంది. ప్రస్తుతం ఇది సీబీఎస్‌ఈలో ఉండగా.. ఇప్పుడు రాష్ట్ర బోర్డులోనూ తీసుకురానున్నారు. ఎంబైపీసీ చదివినవారు ఇంజినీరింగ్, నీట్ రెండింటికీ అర్హులే. ప్రస్తుత విధానంలో ఎంపీసీ గ్రూపు తీసుకుంటే గణితం-1ఏ, 1బీ విడివిడిగా.. భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంతో పాటు మొదటిభాషగా ఆంగ్లం, రెండో భాషగా తెలుగు/సంస్కృతం/ఇతర భాషలను చదువుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తీసుకురానున్న కొత్త విధానంలో గణితానికి ఒకే పేపర్ ఉంటుంది. భౌతిక, రసాయనశాస్త్రాలు ప్రాక్టికల్స్‌తో కలిపి విడివిడిగా వంద మార్కులకు ఉంటాయి.
మొదటిభాష ఆంగ్లం తప్పనిసరి. రెండోభాష స్థానంలో ఏ సబ్జెక్టునైనా ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో భాషలతో పాటు ప్రధాన సబ్జెక్టులనూ ఎంపిక చేసుకోవచ్చు. మొత్తం 23 సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి. ఐదు సబ్జెక్టులు తప్పనిసరి కాగా.. ఆరో సబ్జెక్టునూ విద్యార్థి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటర్మీడియట్ విద్యామండలి పోర్టల్‌లోని 23 సబ్జెక్టుల్లో ఏదో ఒకటి చదువుకోవచ్చు. ఒకవేళ ప్రధాన ఐదు సబ్జెక్టుల్లో ఏదైనా ఒక సబ్జెక్టులో ఫెయిలైతే ఆరో సబ్జెక్టు మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇందులో ఉత్తీర్ణులైతే మొత్తం ఉత్తీర్ణత సాధించినట్లే. ఇక ఇంటర్ సెకండియర్‌లో ఇచ్చే మార్కుల మెమోలో ఐదు సబ్జెక్టులను ఒక చోట 500 మార్కులకు ఇచ్చి, ఆరో సబ్జెక్టును ప్రత్యేకంగా చూపుతారు. ఆర్ట్స్ గ్రూపు వాళ్లు సైన్స్ సబ్జెక్టులను, అలాగే సైన్స్ వాళ్లు ఆర్ట్స్ సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App