TRINETHRAM NEWS

Trinethram News : ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనలు.. నేడు కేజ్రీవాల్‌ అరెస్టయ్యే అవకాశం..! ఆప్ ఆరోపణలపై స్పందించిన ఈడీ..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు నేడు అరెస్ట్ చేయవచ్చని ఆప్‌ ఆరోపించింది. కేజ్రీవాల్ నివాసంలో ఈడీ సోదాలు జరుపుతారనే సమాచారం తమకుందని ఆప్‌ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందే సమన్లు ఎందుకు పంపుతున్నారని ఆప్‌ నేతలు సోషల్‌ మీడియా ద్వారా ప్రశ్నించారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌కు కుట్రలు జరుగుతున్నాయని, రెండు వారాల్లో మూడు సార్లు సమన్లు ఇచ్చారంటూ ఆప్‌ నేతలు పేర్కొన్నారు. ఈడీ ప్రతీ ప్రశ్నకు కేజ్రీవాల్ సమాధానం చెబుతారంటూ పేర్కొన్నారు. అయితే, కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేస్తారంటూ ఆప్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఈడీ వర్గాలు తోసిపుచ్చాయి. కేజ్రీవాల్‌ నివాసంలో సోదాలు ఉండవని, అరెస్ట్ అనేది ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశాయి.

అంతకుముందు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ఈడీ విచారణకు మూడోసారి గైర్హాజరయ్యారు. మూడోసారి సమన్లకు రిప్లై ఇస్తూ ఆయన రాజ్యసభ ఎన్నికలు, రిపబ్లిక్ డే ఉత్సవాల పనుల్లో తలమునకలై ఉండటం వల్ల విచారణకు హాజరుకాలేనంటూ ఈడీకి లేఖ పంపారు. ఈడీ పంపే ఏ ప్రశ్నలకైనా తాను జవాబులివ్వడానికి సిద్ధంగా ఉన్నానంటూనే తనను విచారించేందుకు గల నిజమైన ఉద్దేశాన్ని తెలపాలని ఆయన కోరారు. మూడోసారి కూడా ఈడీ విచారణకు డుమ్మా కొట్టడంతో కేజ్రీవాల్ అరెస్ట్‌ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. కేజ్రీవాల్‌కు మొదటగా గతేడాది నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21న, ఈ ఏడాది జనవరి 3న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు పంపింది. కానీ అన్ని నోటీసులను కేజ్రీవాల్ దాటవేశారు.

మరోవైపు ఈడీ విచారణకు హాజరయ్యేందుకు కేజ్రీవాల్ ఎందుకు భయపడుతున్నారని బీజేపీ ప్రశ్నించింది. తప్పు చేయకపోతే ధైర్యంగా విచారణకు హాజరుకావొచ్చు కదా అని సూచిస్తున్నారు కమలనాథులు. కేజ్రీవాల్ ఈడీ సమన్లను దాటవేసే బదులు ఇండియా కూటమి నాయకులు అవినీతిలో పాఠాలు నేర్చుకోవాలని పేర్కొన్నారు.

2021-22 ఏడాదిలో ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీపై అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఈ పాలసీ కొంతమంది మద్యం డీలర్‌లకు ప్రయోజనం చేకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి నివేదిక అందుకున్న తర్వాత పాలసీలో అవకతవకలపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఈ కేసుకు సంబంధించి గతేడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను సీబీఐ 9 గంటల పాటు ప్రశ్నించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాను 2023 ఫిబ్రవరిలో సీబీఐ అరెస్ట్ చేసింది.
మరిన్ని స్పీడ్ న్యూస్ కోసం క్లిక్‌ చేయండి.