TRINETHRAM NEWS

తుఫాన్ ఫెంగల్ ఇలా దూసుకొచ్చేస్తోంది.. 29న తీరం దాటుతుంది.. ఆ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్..!!

బంగాళాఖాతంలోని వాయుగుండం తుఫాన్ గా మారుతుంది. 2024, నవంబర్ 27వ తేదీ సాయంత్రం అంటే.. బుధవారం సాయంత్రం 5 గంటలకు వాయుగుండం.. తుఫాన్ గా మారుతుంది.

ప్రస్తుతం శ్రీలంక తీరం దగ్గరలో ఉన్న తుఫాన్ ఫెంగల్.. అత్యంత వేగంగా.. భారతదేశం వైపు దూసుకొస్తుంది. ఈ తుఫాన్ తమిళనాడు రాష్ట్రంలో.. నవంబర్ 29వ తేదీన తీరం దాటనున్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. తమిళనాడు, పుదుచ్ఛేరి రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేయగా.. ఏపీకి ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.

నవంబర్ 26వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయానికి.. తుఫాన్ ఫెంగల్ గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. నాగపట్నంకు 590 కిలోమీటర్ల దూరంలో.. పుదుచ్చేరికి 700 కిలోమీటర్ల దూరంలో.. చెన్నై సిటీకి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉన్న ఇది.. 27వ తేదీ సాయంత్రానికి తుఫాన్ గా మారుతుంది. చెన్నై సిటీకి ఈ తుఫాన్ 800 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో.. మధ్యలో దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికి అయితే ఇది తమిళనాడు వైపు వస్తున్నట్లు ప్రకటించిన అధికారులు.. హై అలర్ట్ జారీ చేశారు.

తుఫాన్ ఫెంగల్ ప్రభావంతో నవంబర్ 30వ తేదీ వరకు తమిళనాడులో భారీ వర్షాలు పడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా జిల్లాలు అయిన నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి వానలు పడనున్నాయి. రైతులు అందరూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని.. కోతలు ఉంటే వెంటనే పనులు చేసుకోవాలని.. కల్లాల్లోని పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

నవంబర్ 29వ తేదీ వరకు ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లోని మత్స్యకారులు.. సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. తీరం వెంట 50 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు.

తుఫాన్ ఫెంగల్ ప్రభావం తెలంగాణపై ఉండదని.. అక్కడక్కడ.. కొన్ని చోట్ల మోస్తరు వానలు పడే సూచనలు మాత్రమే ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App