కొనుగోలు ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపిఎంఎస్ లో నమోదు జిల్లా కలెక్టర్ కోయ హర్ష
సన్న రకం ధాన్యానికి క్వింటాల్ 500 రూపాయల బోనస్
*కేజిబీవి సెప్టిక్ ట్యాంక్ వద్ద సైడ్ డ్రైయిన్ నిర్మించాలి జిల్లా కలెక్టర్
ముత్తారం, నవంబర్ -19:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపిఎంఎస్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత అధికారులకు సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష
ముత్తారం మండలంలో విస్తృతంగా పర్యటించారు. ముత్తారం మండలంలోని మచ్చుపేట, మైదం బండ, ముత్తారం గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ కేంద్రాలకు వచ్చిన రైతులతో ఎన్ని ఎకరాలలో పంట సాగు చేశారు, ఎంత దిగుమతి వచ్చింది, కోనుగోలు కేంద్రాలకు పంట తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది, తేమ శాతం ఎంత ఉంది, టార్ఫాలిన్ కవర్లు ఇస్తున్నారా మొదలగు వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాలలో సన్న రకం ధాన్యం కొనుగోలు రిజిస్టర్ లను పరిశీలించారు.
కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులు, టార్ఫాలిన్ కవర్లు అందుబాటులో ఉంచామని అన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉంటూ పంటకు టార్ఫాలిన్ కవర్లు కప్పాలని కలెక్టర్ తెలిపారు. 17 శాతం తేమ రాగానే వడ్లకు కాంటా వేయాలని, కోనుగోలు చేసిన ధాన్యం వివరాలు ఎప్పటికప్పుడు ఓపిఎంఎస్ లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం ప్రత్యేకంగా క్వింటాళ్లుకు 500 రూపాయల బోనస్ ప్రకటించిందని, ఇది ప్రత్యేకంగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ధాన్యం అమ్మే సమయంలో రైతులు సమర్పించిన బ్యాంకు ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు.
మద్దతు ధర పై నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించాలని, ఎటువంటి ఆలస్యం జరగడానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ముత్తారం లోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారితో మాట్లాడి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయని అన్నారు.పాఠశాలలో సెప్టిక్ ట్యాంక్ వద్ద నీరు నిల్వ ఉండకుండా సైడ్ డ్రెయిన్ నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డివిజనల్ పంచాయతీ అధికారి సతీష్, ముత్తారం ఎంపిడిఓ సురేష్, డిప్యూటీ తహసిల్దార్ షఫీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App