TRINETHRAM NEWS

ఈనెల 20 నుంచి కాళేశ్వరంపై విచారణ.. 2 వారాలు హైదరాబాద్‌లోనే జస్టిస్‌ ఘోష్‌

Trinethram News : హైదరాబాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్‌ పినాకి చంద్రఘోస్‌ కమిషన్‌ విచారణ ఈ నెల 20 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది..

విచారణలో భాగంగా జస్టిస్ పీసీ ఘోష్ రెండు వారాల పాటు హైదరాబాద్ లోనే ఉంటారు. ఈ నెల 20 నుంచి ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. కమిషన్ విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించేందుకు డిసెంబర్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

అయితే జీవో జారీలో ప్రభుత్వం జాప్యం చేయడంతో విచారణ రెండు వారాలు ఆలస్యమైంది. ఈ నెల 12 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయించగా… కమిషన్ గడువును ఈ నెల 13న పొడిగిస్తూ ప్రభుత్వం మెమోరాండం విడుదల చేసింది. జీవో కోసం 13 రోజులుగా ఎదురుచూస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, మాజీ ఈఎన్సీలు, చీఫ్ ఇంజినీర్లు, ఎస్ఈల క్రాస్ ఎగ్జామినేషన్ ఇప్పటికే పూర్తయింది..

ఐఏఎస్/మాజీ ఐఏఎస్‌లను విచారించిన అనంతరం… మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇద్దరు మాజీ కీలక ప్రజాప్రతినిధులను విచారణకు హాజరుకావాల్సిందిగా సమన్లు ​​పంపనున్నారు. వారి విచారణకు అవసరమైన ఆధారాలను కమిషన్ ఇప్పటికే సేకరించింది. ఈ నెలాఖరులోగానీ, డిసెంబర్ మొదటి వారంలోగానీ వారిద్దరికీ సమన్లు ​​పంపే అవకాశాలున్నాయి. కమిషన్ నివేదికను డిసెంబర్‌లో ఖరారు చేసి నెలాఖరులోగా ప్రభుత్వానికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App