TRINETHRAM NEWS

కేంద్ర ప్రాయోజిత పథకాలను పకడ్బందీగా అమలు చేయాలి పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ

*నేషనల్ హెల్త్ మిషన్ నిధులను సమర్థవంతంగా వినియోగించాలి

*విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలి

*పెద్దపల్లి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహణ

పెద్దపల్లి, నవంబర్ -14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మన జిల్లాలోని ప్రజలకు కేంద్ర ప్రాయోధిత పథకాల ద్వారా అధికంగా లాభం కలిగే విధంగా అధికారులు పని చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ అన్నారు.

గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కోయ హర్ష, అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ , డి.వేణు లతో కలిసి జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు.

దిశ సమావేశంలో ప్రస్తుతం వారి శాఖల పరిధిలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు, రాబోయే 3 నెలల కాలంలో నిర్దేశించుకున్న లక్ష్యాలు తదితర అంశాల పై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, విద్యుత్ శాఖ,జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా సంక్షేమ అధికారి, జీఏం పరిశ్రమలు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి , జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి, రోడ్లు భవనాల శాఖ, ఈఈ హౌసింగ్, మున్సిపల్ కమిషనర్ , పీ.డీ జాతీయ రహదారులు, వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు వివరించారు.

పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ నేషనల్ హెల్త్ మిషన్ కింద వివిధ కార్యక్రమాలకు వచ్చిన నిధులు, వాటి వినియోగం వివరాలను తెలుసుకొని రోగులకు మరింత సమర్థవంతమైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

నేషనల్ హెల్త్ మిషన్ కింద వివిధ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధులు ,ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తీసుకోవాల్సిన చర్యల ప్రతిపాదనలు అందించాలని అన్నారు. గర్భిణీ మహిళల ఏఎన్సీ రిజిస్ట్రేషన్, మెరుగైన వైద్య చికిత్స అందించాలని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని, రెగ్యులర్ గా పాఠశాలలను తనిఖీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి కి సూచించారు పీఎం శ్రీ పథకం కింద 11 పాఠశాలలకు నూతన భవనాలు, సైన్స్ ల్యాబ్ ఏర్పాటుకు 20 కోట్ల నిధులు వచ్చాయని, వీటిని పూర్తిగా వినియోగించాలని ఎంపీ పేర్కొన్నారు. విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించాలని అన్నారు.

జిల్లాలో ఉన్న 542 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం సమగ్ర శిక్ష అభియాన్ లో అందుబాటులో ఉన్న నిధులు వినియోగం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అన్నారు. పాఠశాలలో పిల్లలు చదివేందుకు వసతులు టాయిలెట్లు, బెంచ్, అదనపు రూమ్ ల నిర్మాణం, కంప్యూటర్ విద్య, ఆంగ్ల పరిజ్ఞానం అంది ఎందుకు చర్యలు మొదలగు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.

జిల్లాలో పిల్లలు పోషక లోపాలను తగ్గించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. సుల్తానాబాద్ లో జరిగిన దుర్ఘటనలు మరో మారు జరగకుండా చూడాలని, చైల్డ్ సేఫ్టీ పై విస్తృతంగా ప్రచారం చేయాలని ఎంపీ ఆదేశించారు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలు ఏవైనా ఉంటే వారికి ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులకు సూచించారు. డిఎంఎఫ్టి నిధులకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు.

జిల్లాలో వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద చేపట్టిన రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణ పనుల స్థితిగతుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పెండింగ్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అవసరమైన మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు ఇండ్లు అందించాలని అన్నారు.

పరిశ్రమల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలు మొదలగు అంశాల పై గణాంకాలతో పక్కా నివేదిక తయారు చేయాలని అన్నారు. జిల్లాలో మంజూరైన మంచిర్యాల వరంగల్ జాతీయ రహదారి నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేయాలని, పెండింగ్ భూ సేకరణ పూర్తి చేసి జాతీయ రహదారుల అథారిటీకి అప్పగించాలని అన్నారు. జిల్లాలో చేపట్టే రోడ్డు మరుమ్మత్తు పనులు నాణ్యతతో పకడ్బందీగా చేపట్టాలని ఎంపీ సూచించారు.

జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ పి.హెచ్.సిల ద్వారా మెరుగైన చికిత్సలు అందించేందుకు 15 కోట్ల వరకు అవసరం అవుతాయని, దీని పై ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి నివేదిక అందించామని అన్నారు. జిల్లాలో నూతనంగా 16 సబ్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, వీటికి టెండర్ల ప్రక్రియ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

ఆర్.బి.ఎస్.కే క్రింద 10 బృందాలు ఉన్నాయని, వేరు ప్రతి రోజు పాఠశాలలను సందర్శించి పిల్లల వైద్య స్థితిగతులను పరీక్షిస్తారని , ప్రతి రోజు దాదాపు 120 విద్యార్థుల వైద్య పరీక్షలు జరుగుతాయని అన్నారు.
టీబి నియంత్రణ కోసం అధికంగా శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారికి సకాలంలో చికిత్స అందిస్తున్నామని అన్నారు.

రామగుండం జనరల్ ఆసుపత్రి బలోపేతం చేశామని అన్నారు. జిల్లాలో జరిగే ప్రతి డెలివరీ ట్రాక్ చేస్తున్నామని, ఆర్తో ఆపరేషన్లు సైతం అధికంగా మన దగ్గర జరుగుతున్నాయని తెలిపారు.

విద్యుత్ శాఖకు సంబంధించి నూతన కనెక్షన్లు విద్యుత్ స్తంభాల మార్పు, మొదలగు సేవలు వినియోగదారులకు సత్వరం లభించేలా చూడాలని అన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు త్వరగా స్పందించేలా వ్యవస్థ పని చేయాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో పోషక లోపాలతో ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన అదనపు పోషకాలతో కూడిన బాలామృతం ప్లస్ తప్పనిసరిగా అందించాలని అన్నారు. జిల్లాలో బాలల హక్కుల పరిరక్షణ కోసం 3 బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, క్షేత్రస్థాయి నుంచి సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ చైల్డ్ సేఫ్టీ చర్యలు చేపడుతున్నామని అన్నారు.

జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు, పాలు ,ఇతర పోషకాహారం వినియోగం నాణ్యతను పరిశీలిస్తూ నివేదిక అందజేయాలని కలెక్టర్ సంబంధిత అధికారిని ఆదేశించారు.

జిల్లాలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం, ముద్రా రుణాలు, సీఎంఎఫ్ఎంఈ, ముద్రా రుణాలు మొదలగు అంశాల పై ప్రచారం కల్పిస్తూ, అవసరం ఉన్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసేలా చూడాలని, రుణాలు పొందేందుకు ఏ దరఖాస్తులు సమర్పించాలి మొదలగు వివరాలను ఆసక్తి గల వారికి తెలియజేయాలని అన్నారు.

జిల్లాలోని విద్యాసంస్థలకు సరఫరా చేసే బియ్యం నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులకు సూచించారు. అక్రమ బియ్యం తరలింపు నివారణకు మరింత ఎన్ ఫోర్స్ మెంట్ ఉండాలని అన్నారు. ప్రస్తుతం సన్న రకం ధాన్యం 500 రూపాయలు క్వింటాల్ బోనస్ అందిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో లబ్ధిదారులకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అప్రోచ్ రోడ్, ఇతర మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

అనంతరం దిశా కమిటీ సమావేశం వివరాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాత్రికేయులకు తెలియజేశారు. గత 10 సంవత్సరాల కాలంలో ఓకే దిశ సమావేశం జరిగిందని, పెద్దపల్లి ప్రాంతం కొంత నిర్లక్ష్యానికి గురైందని, ఈ రోజు అధికారులతో రివ్యూ నిర్వహించి కేంద్ర ప్రభుత్వ పథకాలపై చర్చించి, పెద్దపల్లి ప్రాంతానికి నిధులు తీసుకుని వచ్చే విధంగా ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని అన్నారు.

ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశం నిర్వహిస్తామని, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ పెద్దపల్లి ప్రాంతానికి న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. 35 సంవత్సరాల క్రితం కాకా వెంకట్ స్వామి పెద్దపల్లి పార్లమెంటుకు మొదటిసారి ఎంపీ అయ్యారని, నేడు తనకు అవకాశం లభించిందని, కాకా ఆశీర్వాదంతో పెద్దపల్లి ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్ , డి.ఆర్.డి.ఓ. ఆర్. రవీందర్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App