TRINETHRAM NEWS

Development of India is impossible without development of villages: CAG

Trinethram News : దిల్లీ : దేశంలోని గ్రామాలు అభివృద్ధి కాకుండా వికసిత్‌ భారత్‌ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (CAG) గిరీశ్‌ చంద్ర ముర్ము పేర్కొన్నారు.

2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో గ్రామీణ భారతం కీలకమని వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని, గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు లభించడం లేదని చెప్పారు.

”క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగకుండా.. వికసిత్‌ బారత్‌ లక్ష్యాన్ని చేరుకోవడం సులువు కాదు. దేశంలోని 50 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తోంది. ప్రభుత్వ పాలన, వారి అభివృద్ధి, వారి పాలనాధికారాలు, వారికి తగిన వనరులు అందించకుండా.. అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం అందుకోవడం సాధ్యం కాదు. మన ప్రధాని చెప్పినట్లు ఒక్కొక్కరూ ఒక్కో అడుగు వేస్తే 140 కోట్ల అడుగులు అవుతాయి. అందుకే ప్రజల భాగస్వామ్యం చాలా కీలకం” అని కాగ్‌ అన్నారు.

దేశంలో 2.60 లక్షల పంచాయతీలు, 7 వేల స్థానిక సంస్థలు ఉన్నాయని గిరీశ్‌ చంద్ర మర్ము అన్నారు. స్థానిక సంస్థలను సమర్థంగా తీర్చిదిద్ది ప్రభుత్వ పథకాలు అందేలా చూడడం అనేది దేశానికి చాలా మంచిదని చెప్పారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదన్నారు. స్థానిక సంస్థలకు వెళ్లే నిధుల విషయంలో అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ది కీలక భూమిక అని పేర్కొన్నారు. కాబట్టి సరైన అకౌంటింగ్‌ విధానాలను పాటించని మున్సిపల్‌ కార్పొరేషన్‌లకు నిధులు సమీకరించే అనుతులు ఇవ్వకూడదని చెప్పారు. స్థానిక సంస్థలు సరైన అకౌంటింగ్‌, ఆడిట్‌ విధానాలు పాటించేలా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Development of India is impossible without development of villages: CAG