TRINETHRAM NEWS

Route map for the development of AP as the No. 1 state in the country!

చంద్రబాబు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా అడుగులు

దేశంలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దుతాం

20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి

విశాఖపట్నంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్

సిఐఐ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి లోకేష్

Trinethram News : Andhra Pradesh : విశాఖపట్నం: 2047నాటికి దేశంలో నెం.1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేయడానికి రూట్ మ్యాప్ సిద్ధం చేశామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యాన విశాఖ నోవాటెల్ హోటల్ లో నిర్వహించిన ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరుకాగా, ఆర్ అండ్ బి, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రి జనార్దన్ రెడ్డి, సిఐఐ ఎపి శాఖ చైర్మన్ వి.మురళీకృష్ణ, జిఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ బిజినెస్ చైర్మన్ జిబిఎస్ రాజు అతిధులుగా హాజరయ్యారు.

మంత్రి లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలు, ఆర్థిక వనరులు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన సదస్సుకు జాతీయస్థాయి ప్రముఖ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సులో లోకేష్ మాట్లాడుతూ… రాష్టంలో కొత్తగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పన అత్యధిక ప్రాధాన్యత నిస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి గత ప్రభుత్వ చర్యల కారణంగా అయిదేళ్లుగా స్పీడ్ బ్రేకర్లు పడ్డాయి. అన్నివిధాలా నిర్లక్ష్యానికి గురైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. చంద్రబాబునాయుడు నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగవంతంగా ముందుకు సాగుతోంది.
అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రత్యేక దృష్టి
చంద్రబాబునాయుడు నేతృత్వంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ప్రధానంగా మేం దృష్టిసారించాం. అందులో భాగంగా ప్రతిజిల్లాలో ఒక రంగంపై దృష్టిసారించి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నాం. కర్నూలు జిల్లాలో రెన్యువబుల్ ఎనర్జీ అభివృద్ధిపై దృష్టి సారిస్తాం. రాబోయే అయిదేళ్లలో 72గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా హైడ్రో, విండ్, సోలార్ విద్యుతుత్పత్తి ప్రాజెక్టులు పెద్దఎత్తున అక్కడకు వస్తాయి.

అనంతపురం జిల్లాలో ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, చిత్తూరు, కడప జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్, ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో క్యాపిటల్ రీజియన్, గోదావరి జిల్లాలో ఆక్వాఉత్పత్తుల పరిశ్రమలను అభివృద్ధి చేస్తాం. రోడ్లు, మౌలిక సదుపాయాలు గత అయిదేళ్లుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. గోదావరి జిల్లాల్లో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని అభివృద్ధి చేస్తాం. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్ కారిడార్ అక్కడ రాబోతోంది.
*విశాఖపట్నంలో అంతర్జాతీయస్థాయి డాటా సెంటర్ *
విశాఖపట్నాన్ని ప్రపంచంలోనే నెం.1 ఐటి హబ్ గా తయారుచేయాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి డాటా సెంటర్ అభివృద్ధి చేయబోతున్నాం. ఉత్తరాంధ్రను ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభయ్యాక విశాఖపట్నంతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాలు విప్లవాత్మకమైన అభివృద్ధి సాధిస్తాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్ కనెక్టివిటీ ఏర్పాటుకు కృషిచేస్తాం.

అయితే కేవలం పోర్టులు, ఎయిర్ పోర్టులు ఉంటే మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినట్లు కాదు. ఆయా రంగాల్లో సాధించిన అభివృద్ధి ద్వారా వచ్చిన సంపద సమాజంలో అన్నివర్గాలకు పంపిణీ చేయడమే అసలైన అభివృద్ధి. దేశంలో 2వ అతిపెద్ద ఎయిర్ పోర్టుగా నేడు హైదరాబాద్ ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందింది. దీనిద్వారా సృష్టించిన సంపదతో తెలంగాణా వేగంగా అభివృద్ధి చెందుతోంది. జిఎంఆర్ ఆధ్వర్యాన భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం ద్వారా విశాఖపట్నంలో దేశంలోనే మెరుగైన మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం.
ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మహా విశాఖ
విశాఖపట్నాన్ని ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తయారుచేయడమే మా లక్ష్యం. ఆర్థిక రాజధానికి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం. త్వరలో విశాఖపట్నంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ రాబోతోంది. విశాఖ-చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్ పనులను వేగవంతం చేస్తాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది గతం మాట. ఇప్పుడు చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతున్నాం. ఇండస్ట్రీ ఫ్రెండ్లీ విధానాలతో త్వరలో కొత్త పారిశ్రామిక పాలసీ, ఐటి, ఎలక్ట్రానిక్స్ పాలసీలు ప్రకటిస్తాం. రాష్ట్రంలో యువ ఐఎఎఎస్ అధికారి సారధ్యంలో ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు (ఈడిబి)ని పునరుద్దరించాం.

దీనిద్వారా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా పరిశ్రమలకు అవసరమైన అనుమతులు ఇస్తాం. ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈడిబి క్రియాశీలకంగా పనిచేయబోతోంది. ప్రస్తుతం దేశంలో 9వ అతిపెద్ద ఎకనమిక్ సిటీగా ఉన్న విశాఖ పట్నాన్ని రాబోయే అయిదేళ్లలో 5వ అతిపెద్ద ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుతాం. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు జిఎంఆర్ చేస్తున్న కృషి అభినందనీయం. రాష్ట్రంలో రాబోయే అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యసాధనలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి, వికసిత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని మంత్రి నారా లోకేష్ పారిశ్రామిక వేత్తలకు పిలుపునిచ్చారు.
రూ.17వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి: మంత్రి జనార్దన్ రెడ్డి
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వాన వేగవంతంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.17వేల కోట్ల రూపాయల వ్యయంతో పిపిపి విధానంలో రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు, కాకినాడ గేట్ వే పోర్టులు శరవేగంగా నిర్మితమవుతున్నాయి. రాష్ట్రంలో నేషనల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ పైప్ లైన్ లో ఉంది. మౌలిక సదుపాయాల వృద్ధిలో భాగంగా ఎయిర్ కనెక్టివిటీ పెంచుతున్నాం.

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణం శరవేగంగా సాగుతోంది. గ్లోబల్ మార్కెట్ కు దీటుగా విశాఖపట్నంలో వరల్డ్ క్లాస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేస్తాం. పిపిపి మోడ్ లో క్రిటికల్ ఇన్ ఫ్రా, హౌసింగ్ ప్రాజెక్టులు చేపడతాం. చంద్రబాబునాయుడు మార్గనిర్దేశకత్వంలో ఇన్ ఫ్రా అభివృద్ధిలో భాగంగా విశాఖ – చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ – చెన్నయ్ ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నయ్ – బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. కొత్తగా గ్రీన్ ఫీల్డ్ పోర్టులు రాబోతున్నాయని జనార్దన్ రెడ్డి చెప్పారు.
18నెలల్లో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి: ఎంపి భరత్
రాబోయే 18నెలల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విశాఖ ఎంపి ముతుకుమిల్లి శ్రీభరత్ పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధిలో విశాఖపట్నం దేశంలో 10వ నగరంగా ఉండగా, ఎయిర్ కనెక్టివిటీ విషయంలో మాత్రం 27వస్థానంలో ఉందని అంటూ ఈ గ్యాప్ ను సరిదిద్దాల్సి ఉందని చెప్పారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక విశాఖపట్నం నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్ కార్గో ప్రారంభమైంది. వ్యక్తిగత విద్యుత్ యూనిట్ ఏర్పాటుచేసుకునేలా త్వరలో రాష్ట్రంలో పిఎం సూర్య పథకం ప్రారంభం కాబోతోంది. దీనిద్వారా విప్లవాత్మక మార్పులు రావడంతోపాటు చౌకగా విద్యుత్ లభిస్తుంది. విశాఖ నగరంలో ఇప్పటికే ప్రారంభమైన ఇన్ ఫ్రా ప్రాజెక్టులపై మంత్రి లోకేష్ దృష్టిసారించి, వేగంగా పూర్తిచేసేందుకు సహకరించాలి.

షీలానగర్ – సబ్బవరం రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. అనకాపల్లి – భీమిలి రోడ్డు విశాఖపట్నం నగరం గుండా వెళ్ల ట్రాపిక్ సమస్య ఏర్పడుతోంది. ఈ సమస్య పరిష్కారానికి 12 ఫ్రైఓవర్లు ప్రతిపాదించాం. ఎలివేటెడ్ హైవే రోడ్డు నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నాం. ట్రాఫిక్ నియంత్రణకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక మార్గాలను అన్వేషిస్తున్నాం. అధునాతన టెక్నాలజీతో హౌసింగ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకురావాలి. మంత్రివర్గంలో యువనాయకత్వంతో విశాఖనగరం వేగవంతంగా అభివృద్ధి సాధించబోతోంది, ఇందుకు పారిశ్రామికవేత్తలు తమవంతు సహాయ,సహకారాలు అందించాలని ఎంపి భరత్ విజ్ఞప్తిచేశారు. సమావేశంలో సిఐఐ విశాఖ జోన్ చైర్మన్ గ్రంధి రాజేష్, ప్రతినిధులు ఈ.శంకర్రావు, వి.అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Route map for the development of AP as the No. 1 state in the country!