Harish Rao : ముఖ్యమంత్రి రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

TRINETHRAM NEWS

Harish Rao’s open letter to Chief Minister Revanth

ఎల్‌ఆర్‌ఎస్‌పై నాడు ఫ్రీ .. నేడు ఫీజులా?: హరీశ్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

ప్రభుత్వ మెడలు వంచి ఉచితం చేయించే బాధ్యత బీఆర్‌ఎస్‌ది

ప్రజలు ఒక్క రూపాయి కూడా కట్టొద్దు: మాజీ మంత్రి హరీశ్‌

Trinethram News : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం లే అవుట్‌ క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)ను ఉచితంగా అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. రుణమాఫీ కాక, రైతుబంధు రాక రైతన్నలు ఆవేదన చెందుతుంటే.. విషజ్వరాలతో సామాన్యులు అల్లాడుతుంటే.. ప్రభుత్వం మాత్రం ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్‌ నుంచి పంచాయతీ సెక్రటరీ వరకు ఉన్న యంత్రాంగంపై ఒత్తిడి చేయటం అన్యాయమని అన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితం చేయాలని కోరుతూ ఆయన సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు.

లేఖలో.. పంచాయతీ కార్యదర్శులు, బిల్‌ కలెక్టర్లు రోజుకు మూడు, నాలుగు సార్లు ఫోన్‌ చేసి ప్రజలను వేధిస్తున్నారని, ఫీజులు చెల్లించకుంటే లే అవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. డిమాండ్‌ నోటీసులు ఇస్తూ, టార్గెట్లు పెట్టి రూ.15 వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వటం అంటే ప్రజల రక్తమాంసాలను పీల్చడమేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. ఆనాడు ఎల్‌ఆర్‌ఎస్‌ అంటే దోపిడీ అని.. ఇప్పుడు ప్రజలను దోపిడీ ఎందుకు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు. నాడు ఫ్రీ ఫ్రీ ఫ్రీ అని, నేడు ఫీజు ఫీజు ఫీజు అంటున్నారని.. ఓడ దాటే దాక ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న చందంగా కాంగ్రెస్‌ వైఖరి తేటతెల్లమవుతున్నదని ధ్వజమెత్తారు. ‘అపుడు ఎల్‌ఆర్‌ఎస్‌కు ఫీజు వద్దన్న మీరు ఇప్పుడు అధికారంలోకి రాగానే అదే ఎల్‌ఆర్‌ఎస్‌తో దందా చేస్తున్నారా? అప్పుడు కట్టొద్దని ఇప్పుడు కాటు వేస్తారా? స్వయంగా మీతో సహా ప్రస్తుతం మీ క్యాబినెట్లో సహచరులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక, కోమటిరెడ్డి వంటి నేతల మాటలను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా’ అని లేఖలో పేర్కొన్నారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి: నో ఎల్‌ఆర్‌ఎస్‌- నో బీఆర్‌ఎస్‌, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేస్తాం.

భట్టి విక్రమార:
రక్తాన్ని పీల్చాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. వీలైతే కట్టకండి. అప్పుల భారాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌ రూపంలో ప్రజల మీద వేస్తున్నారు.

సీతక్క: ఎల్‌ఆర్‌ఎస్‌ పేరుతో దోచుకోవడానికి, దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా చేయడానికి కొత్త నాటకం.

రేవంత్‌రెడ్డి: బీఆర్‌ఎస్‌ అయిపోయింది. ఎల్‌ఆర్‌ఎస్‌ అయిపోయింది. ఎంఆర్‌ఎస్‌ తెస్తడట. ఎంఆర్‌ఎస్‌ అంటే మ్యారేజ్‌ రెగ్యులరైజేషన్‌ సీం కూడా తీసుకొస్తుందేమో.

ఇవి మాత్రమే కాదు, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు చేయాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏకంగా హైకోర్టుకు వెళ్లారని హరీశ్‌రావు గుర్తు చేశారు. పిల్‌ దాఖలు చేశారని, ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్యపెట్టి రెచ్చగొట్టేలా బహిరంగ సభల్లో ఊదరగొట్టారని, ఎన్నికలు పూర్తికాగానే మాట మార్చి ఎల్‌ఆర్‌ఎస్‌పై ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రెండు నాలల ధోరణికి అద్దం పడుతుందని విమర్శించారు. ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటున్న మీకు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాల ఆవేదన కనిపించటం లేదా? ఇప్పటికైనా కండ్లు తెరిచి హామీ ప్రకారం పూర్తి ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మాట తప్పిన ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఏ ఒకరూ ఒక రూపాయి ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు కూడా చెల్లించవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నామని, కాంగ్రెస్‌ ప్రభుత్వ మెడలు వంచి ఎల్‌ఆర్‌ఎస్‌ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్‌ఎస్‌ తీసుకుంటుందని తేల్చిచెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Harish Rao's open letter to Chief Minister Revanth

You cannot copy content of this page

Scroll to Top