TRINETHRAM NEWS

అయ్యప్ప స్వాములూ.. బహుపరాక్‌!
ఒక్క కేరళలోనే 2వేల మందికి పైగా పాజిటివ్‌
తమిళనాడు,కర్ణాటక,తెలంగాణల్లోనూకేసులు
విశాఖలో మూడు పాజిటివ్ కేసులు రాజమహేంద్రవరంలో వృద్ధురాలికి కొవిడ్‌

దేశంలో కరోనా మహమ్మారి మరోమారు కలకలం రేపుతోంది. కొవిడ్‌ కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 తీవ్ర రూపం దాలుస్తోంది. కేరళలో మొదలై అన్ని రాష్ట్రాలకూ విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,500 వరకూ కేసులు వెలుగులోకి వచ్చాయి. కొత్త వైరస్‌ ఈ నెల 6న దేశంలోకి ప్రవేశించిన నాటినుంచి రోజుకు 300కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా పాజిటివ్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు శబరిమలై వెళ్తున్నారు. కేరళలో కరోనా విస్తరణ వేగం పుంజుకుంటున్నందున వీరంతా కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. జనసందోహం ఉన్న ప్రదేశాలకు వీలైనంత వరకూ దూరంగా ఉండాలని, దర్శనం సమయంలో కచ్చితంగా మాస్క్‌ ధరించాలని, శానిటైజర్‌ ఉపయోగించాలని సూచిస్తున్నారు. వీలైతే దర్శనం అనంతరం నేరుగా ఇంటికి వచ్చే అవకాశాలను పరిశీలించాలని చెబుతున్నారు. యాత్ర ముగించుకుని వచ్చిన స్వాముల్లో జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. నెగెటివ్‌ ఫలితం వచ్చినా కుటుంబ సభ్యులకు దూరంగా హోం ఐసొలేషన్‌లో ఉండి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా వీలైనంత వరకూ తీర్థయాత్రలకు సంబంధించిన ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిదని పేర్కొంటున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో, ప్రయివేటు ల్యాబ్‌ల్లో కొవిడ్‌ పరీక్షలు ప్రారంభించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కొత్త వేరియంట్‌ కేసులు రాలేదు. కానీ అక్కడక్కడ పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడలో ఇప్పటికే పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధించిన శాంపిల్స్‌ను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం విజయవాడ పంపినట్లు తెలుస్తోంది.

సరిహద్దు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు

ఆంధప్రదేశ్‌కు సరిహద్దు రాష్ట్రాల్లో కొవిడ్‌ కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా కేరళలో 2,100 మందికి పాజిటివ్‌ వచ్చింది. కొత్త వేరియంట్‌కు సంబంధించి కర్ణాటకలో 80కిపైగా, తమిళనాడులో 70, మహారాష్ట్రలో 40, తెలంగాణలో 9 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏపీ నుంచి ఎక్కువమంది అయ్యప్ప భక్తులు కేరళ వెళ్లి వస్తున్నారు. ఇదే అతిపెద్ద ప్రమాదంగా మారుతుందేమోననినిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ ఉపయోగించడంతో పాటు భౌతిక దూరం నిబంధన పాటించాలని సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు జనసందోహం ఉన్న ప్రదేశాలకు వెళ్లొద్దని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు.

రాజమహేంద్రవరంలో వృద్ధురాలికి పాజిటివ్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన 84ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. రెండురోజుల క్రితం లక్షణాలు కనిపించడంతో శాంపిల్స్‌ తీసుకుని, ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌ కోసం కాకినాడ ల్యాబ్‌కు పంపగా, పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఆమెను హోం ఐసొలేషన్‌లో ఉంచి వైద్యసేవలందిస్తున్నారు.

విశాఖలో మూడు కేసులు

విశాఖపట్నం జిల్లాలో కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న ముగ్గురు ల్యాబ్‌కు వెళ్లి పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ వచ్చింది. వీరి నమూనాలు విజయవాడలోని జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ ల్యాబ్‌కు పంపించారు. వీరిలో ఒకరికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. మిగిలిన ఇద్దరూ హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, నెల్లూరులో రెండురోజుల క్రితం లక్షణాలు కనిపించిన ముగ్గురిని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. కరోనా బాధితుల కోసం ఏర్పాటుచేసిన వార్డులో ఉంచారు. ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షల్లో నెగెటివ్‌ రావటంతో బాధితులను డిశ్చార్జ్‌ చేశారు. కరోనా బాధితుల కోసం జీజీ హెచ్‌లో 110 పడకలను సిద్ధంచేశారు.