TRINETHRAM NEWS

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్యపరంపరలు చేకూరతాయని భక్తుల విశ్వాసం.

అందుకే, తెల్లవారుజామునే స్వామివారి దర్శనార్థం ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు.

తిరుమలలో తెల్లవారు జామున ఒంటి గంట 45 నిమిషాలకు శ్రీవారి వైకుంఠ ద్వారాలు తెరచుకున్నాయి. ధనుర్మాసం నేపథ్యంలో ముందుగా తిరుప్పావై ప్రవచనాలు వినిపించడంతోపాటు శ్రీవారికి ఇతర కైంకర్యాలు పూర్తి చేశారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. అటు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ప్రముఖులు తరలి వచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీజేఐ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీ రమణ సహా పలువురు న్యాయమూర్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు.

ఉదయం 9 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి… స్వర్ణ రథంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. జనవరి 1న అర్ధరాత్రి 12 గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంచనున్నారు.

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా….. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే ఆలయాల్లో భారీగా భక్తుల రద్దీ పెరిగింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను చూసేందుకు వేలాదిగా భక్తులు కదిలి వచ్చారు. వేడుకల్లో భాగంగా ఈ రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం నిర్వహించారు. ఈ రోజు ఉదయం 12 గంటల నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. హైదరాబాద్ లోని వనస్థలిపురంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. మరోవైపు తమిళనాడులోని శ్రీరంగ ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు భారీగా తరలివచ్చారు.

తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామున 2.30 గంటలకు స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు.