TRINETHRAM NEWS

Trinethram News : February 29, 2024

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న రిటైర్డ్ అధికారులను తొలగించే అంశంపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

అన్ని శాఖల్లో మొత్తం 1,050 మంది ఉండగా.. వీరిలో నిజాయితీ పరులు, అవినీతి ఆరోపణలు లేని అధికారుల్లో కొంత మంది సేవలను ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ కోవకు చెందిన అధికారులపై ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి అందచేశారు. ఇందుకు రిటైర్డ్ అధికారులు పనిచేస్తున్న శాఖల అధికారులను, పలువురు సీనియర్ అధికారులకు స్వయంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఫోన్లు చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది.

ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. జీఏడీ లిస్ట్ చేసి సీఎస్ కు అందచేసినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో ఈ లిస్ట్ ను సీఎంకు సీఎస్ అందచేయనున్నారు. ఇక అన్ని శాఖల్లో రిటైర్డ్ అధికారులను త్వరగా తొలగించాలని ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇరిగేషన్ ఈఎన్సీలను తొలగించిన ప్రభుత్వం ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ ఈఎన్సీలను మాత్రం తొలగించలేదు. మరో వైపు ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ లో ఉన్న ఎస్ఈఆర్టీలో కొనసాగుతున్న రిటైర్డ్ ఆఫీసర్లను తొలగించారు.

అన్ని శాఖల్లో ఉన్న అధికారులను తొలగించాలని డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత 10 ఏండ్లుగా ఈ రిటైర్డ్ అధికారులు ఉన్నత హోదాల్లో ఉండటం వల్ల చాలా మంది అధికారులకు ప్రమోషన్లు రాకుండానే రిటైర్ అయ్యారని పలువురు అధికారులు చెబుతున్నారు. రిటైర్డ్ అధికారులు వందల కోట్లు అవినీతికి పాల్పడ్డారని, వారిపై సమగ్ర విచారణ జరిపించి శిక్షించాలని కూడా కోరుతున్నారు.