కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే పలు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 2,049 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం 2,049 పోస్టులకు గాను ఆయా పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ అర్హత సాధించి ఉండాలి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఫిబ్రవరి 26వ తేదీన మొదలైన దరఖాస్తుల స్వీకరణ మార్చి 18వ తేదీ వరకు కొనసాగనుంది. ఇక దరఖాస్తుల ఫీజు చెల్లింపునకు మార్చి 19వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఒకవేళ అప్లికేషన్స్‌లో ఏమైనా మార్పులు, చేర్పులు చేసుకోవాలనుకుంటే మార్చి 22వ తేదీ నుంచి మార్చి 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు.
పోస్టుల ఆధారంగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారి వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. కేటగిరీల వారీగా వయో సడలింపు కల్పించారు. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు సడలింపు ఇచ్చారు. ఇక దరఖాస్తు ఫీజు విషయానికొస్తే జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.100. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/మహిళలు/ఎక్స్‌సర్వీస్‌మెన్ కేటగిరీకి చెందిన వారికి పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
అభ్యర్థులను కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మే 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నిర్వహిస్తారు. ఇక ప్రతీ తప్పుడు సమాధానానికి హాఫ్ మార్క్ కట్ చేస్తారు. పరీక్ష పత్రం విషయానికొస్తే జనరల్ ఇంటెలిజెన్స్ మొత్తం 25 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులు, జనరల్ అవెర్‌నెస్ 25 ప్రశ్నలు ఉంటాయి 50 మార్కులు, క్వాంటిటేటివ్ అపిట్యూడ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వెజ్ 25 ప్రశ్నలకు గాను 50 మార్కులుగా నిర్ణయించారు.