Trinethram News : ములుగు జిల్లా:ఫిబ్రవరి 21
నాలుగు రోజులే కీలక మైనవి.
మొదటిరోజైన నేడు కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుతుంది. రాత్రి పూనుగొండ్ల నుంచి మేడారానికి చేరుకున్న పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. దీంతో మహాజాతర లాంఛనంగా ప్రారంభం అవుతుంది.
రెండో రోజు గురువారం చిలకలగుట్టపై నుంచి సమ్మక్కను ప్రభుత్వ లాంఛనాలతో గద్దెపైకి తీసుకొస్తారు. సమ్మక్క గద్దెలపైకి చేరటంతో జాతర పతాక స్థాయికి చేరు కుంటుంది.
మూడో రోజు శుక్రవారం గిరిజనుల ఆరాధ్యదైవాలైన సారలమ్మ, సమ్మక్కలు గద్దెపైకి చేరటంతో శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.
నాలుగో రోజు శనివారం గద్దెలపై ఉన్న తల్లులకు మొక్కులు అనంతరం సాయంత్రం 6 గంటల తర్వాత సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవింద రాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది.
జంపన్నవాగులో జన సునామీ
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేసిన తర్వాతే తల్లుల దర్శనానికి వెళ్లటం సంప్రదాయంగా వస్తోంది.
మేడారంలోని జంపన్న వాగుపై ఉన్న జోడు వంతెనల నుంచి 10 కిలో మీటర్ల వరకు భక్తులతో జంపన్నవాగు జనసముద్రం అవుతుంది. మేడారం, నార్లాపూర్, ఊరట్టం, కన్నెపల్లి, కాల్వపల్లి, రెడ్డిగూడెం ప్రాంతాలన్ని కూడా జంపన్నవాగు సమీపంలో ఉండటంతో ఇక్కడ పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు క్యూ కడతారు.
ఇసుక వేస్తే రాలనంతగా జనంతో జంపన్నవాగు ప్రయాగ్‌రాజ్‌లోని గంగ, యమున నదుల్లో జరిగే కుంభమేళాను తలపిస్తుంది. దీంతో తెలంగాణ కుంభమేళాగా మేడారం జాతరను పిలుస్తున్నారు. ఒక గిరిజన జాతరకు కోట్లాది మంది భక్తులు రావటం కూడా ప్రపంచం లోనే అరుదైన జాతరగా గుర్తింపు పొందింది.
ఈనెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడారం వచ్చి అమ్మలను దర్శించు కుంటారు. గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి కూడా అదేరోజు మేడారానికి విచ్చేసి అమ్మలను దర్శించుకోనున్నారు..