సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar

– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 02, త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీలు’, 420 హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను తీవ్రంగా వంచించిందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనకు నిరసనగా దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, బస్‌స్టాండ్ వద్ద మహాధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్….మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, సంక్షేమ పథకాల పరిస్థితిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఎన్నికల సమయంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కాంగ్రెస్ అభ్యర్థులు దేవాలయాల్లో దేవుళ్ల సాక్షిగా ఒట్లు వేసి ‘గ్యారెంటీ కార్డులు’ పంపిణీ చేశారని ఆయన గుర్తుచేశారు. 2023 డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన మొదటి రోజే సంతకం చేసి, 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను సంపూర్ణంగా అమలు చేస్తామని ప్రజలను నమ్మించారని తెలిపారు.

అయితే 100 రోజుల గడువు దాటి దాదాపు 1000 రోజులు కావస్తున్నా హామీల అమలు మాత్రం శూన్యంగా ఉందని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయని హామీల కారణంగా వివిధ వర్గాలకు చెల్లించాల్సిన బకాయిలను రమావత్ రవీంద్ర కుమార్ వివరించారు.మహిళలకు: 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ఈ లెక్కన ఒక్కో మహిళకు రూ.82,500 బకాయి ఉందన్నారు.కళ్యాణలక్ష్మి: పథకం కింద తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, దేవరకొండ నియోజకవర్గంలో చెక్కులు పొందిన సుమారు 5,000 మంది ఆడబిడ్డలకు తులం బంగారం బకాయి ఉందన్నారు.మహిళా విద్యార్థినులు: అర్హులైన విద్యార్థినులకు ఉచిత స్కూటర్ల పంపిణీ హామీని గాలికొదిలేశారని విమర్శించారు.రైతులు: ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పి, పాత పథకం కింద ఇచ్చే మొత్తాన్ని కూడా సక్రమంగా ఇవ్వలేదని ఆరోపించారు.

నాలుగు ఎకరాల రైతుకు రైతు భరోసా రూపంలోనే దాదాపు రూ.1,02,000 బకాయి ఉందన్నారు.పింఛన్లు: వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు ఇస్తున్న రూ.2,000 పింఛన్‌ను రూ.4,000కు పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, పెంచాల్సిన రూ.2,000 చొప్పున ఒక్కో లబ్ధిదారునికి రూ.66,000 బకాయి పడిందన్నారు.దివ్యాంగులు: రూ.6,000 పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ఒక్కో దివ్యాంగుడికి రూ.66,000 బకాయి ఉందన్నారు.రుణమాఫీ: రూ.2 లక్షల పూర్తిస్థాయి రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ఆరోపించారు.ధాన్యం బోనస్: వడ్ల కొనుగోలుపై క్వింటాలుకు రూ.500 బోనస్ అన్ని రకాల ధాన్యానికి ఇస్తామని చెప్పి, ఇప్పుడు నిబంధనల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.

ఎకరానికి రూ.12,500 చొప్పున గత ఆరు పంటలకు కలిపి రైతుకు రూ.75,000 వరకు బోనస్ బకాయి ఉందన్నారు.వ్యవసాయ, ఉపాధి కూలీలు: ఏడాదికి రూ.12,000 ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో రెండేళ్లకు రూ.24,000 చొప్పున బకాయి ఉందన్నారు.ఆటో డ్రైవర్లు: ఏడాదికి రూ.12,000 చొప్పున రెండేళ్లకు రూ.24,000 ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. విద్యార్థులు: రూ.5 లక్షల విద్యా భరోసా కార్డుల హామీ అమలు కాలేదని, గత ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.నిరుద్యోగులు: నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, ఈ లెక్కన ఒక్కో నిరుద్యోగికి రూ.1,32,000 బకాయి పడిందన్నారు.

  • ఉద్యోగాలు: రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు.రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రమావత్ రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడంతో పాటు ప్రజలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత, రైతులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page