350 పడకల రామగుండం (గోదావరిఖని) ఆసుపత్రి 10 నెలల్లో పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించాలి
*సిబ్బంది సమయపాలన పాటిస్తూ త్వరగా స్కానింగ్ పరీక్ష ఫలితాలు అందించాలి
*రామగుండం ఆసుపత్రి నీ ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండంలో నూతనంగా నిర్మాణం అవుతున్న ఆసుపత్రి పనులను, గోదావరిఖని జనరల్ ఆసుపత్రిని, రామగుండం తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష రామగుండంలో 350 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను తనిఖీ చేసి పనుల పురోగతి వివరాలను తెలుసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ దశలో ఉన్న పనులు వేగవంతం చేయాలని, ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యం ప్రకారం సకాలంలో పూర్తి చేసి ప్రజలకు 10 నెలలలో అందుబాటులోకి నూతన ఆసుపత్రి భవనాన్ని తీసుకుని రావాలని అన్నారు.
గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలోని జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, ఈ.ఎన్.టి, డెంటల్, ఏ.ఆర్.టి సెంటర్, న్యూ బ్లాక్ లను పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రి సిబ్బంది విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని అన్నారు.
ఆసుపత్రిలో రోగులకు నిర్వహించే వివిధ పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. టిఫా స్కానింగ్ సేవలు గర్భిణీ మహిళలు విస్తృతంగా వినియోగించుకునేలా చూడాలని అన్నారు. ఆస్పత్రిలోని పేషంట్లతో మాట్లాడి వారికి ఏ విధమైన సేవలందితున్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న ఔట్ పేషంట్ సేవలు వివరాలను తెలుసుకున్న కలెక్టర్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు మన ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించాలని అన్నారు.
అనంతరం రామగుండం తహసిల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓటరు జాబితాలో వచ్చిన దరఖాస్తుల స్థితిగతులు, ధరణి దరఖాస్తుల వివరాలను తెలుసుకొని పెండింగ్ లో ఉండకుండా చూడాలని అన్నారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట రామగుండం వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు సింగ్, ఆసుపత్రి ఆర్.ఎం.ఓ అప్పారావు, డిప్యూటీ తహసిల్దార్ ఈశ్వర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App