TRINETHRAM NEWS

Trinethram News : అధిష్టానం మేరకు నాలుగో లిస్టులో ఎవరి పేరు మాయమౌతుందో.. వైసీపీ ఎమ్మెల్యేల్లో దడ..త్వరలోనే జాబితా లిస్ట్ విడుదల..

ఆంధ్రపదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. మరింత దూకుడుగా ముందుకెళ్తోంది అధికార వైసీపీ. అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు… ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల కాగా.. పండగ తర్వాత మరో లిస్టును రిలీజ్‌ చేసేందుకు సిద్ధమవుతుండటంతో.. ఇంకెన్ని మార్పులు ఉంటాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పండగకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. మార్పులు, చేర్పులు కొనసాగుతాయని అధిష్టానం నుంచి సంకేతాలొస్తున్నాయి.. ఒకట్రెండు రోజుల్లో నాలుగో జాబితా విడుదలకు రెడీ అవుతోంది. అయితే, ఇప్పటికే 60మంది దాకా ఇన్‌ఛార్జుల మార్చిన వైసీపీ అధిష్ఠానం.. ఆ సంఖ్యను మరింత పెంచడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి లిస్ట్ లో 11 మందిని మార్చగా.. సెకెండ్ లిస్ట్‌లో 27 మందిని మార్చారు. మూడో లిస్ట్ లో 21 మంది ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు దశల్లో 59మందికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్లు ఖరారు చేశారు. అయితే, నాలుగో లిస్ట్ కాక.. లాస్ట్‌ మినిట్ వరకు కూడా ఛేంజెస్ తప్పవన్న సంకేతాలు ఇస్తుండటం ఇప్పుడు నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది.

వైసీపీలో మార్పులుచేర్పులపై అసంతృప్త రాగాలు వినిపిస్తున్నా.. నిరసనలు కంటిన్యూ అవుతున్నా… హైకమాండ్‌ లెక్కచేయడం లేదు. ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందనీ.. అప్పటి వరకు మరిన్ని మార్పులు ఉంటాయని స్పష్టం చేస్తోంది. ఆ పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. తాను కూడా ఈసారి ఎంపీ పోటీచేయడం లేదని ప్రకటించారు వైవీ.

నాలుగో లిస్టులో ఎవరి పేరు ఉంటుంది? ఎవరి పేరు మాయమౌతుంది? అన్నదే .. నేతలను టెన్షన్‌ పెడుతోంది. మరోవైపు పలుచోట్ల అసంతృప్తులు తమ నిరసనను తెలియజేస్తున్నారు. పెనమలూరులో కనిపించిన ఫ్లెక్సీలు ఒక్కసారిగా కలకలం రేపాయి. కుట్రపూరితంగా ఓడిపోయే సీటును జోగిరమేష్‌కు ఇచ్చారంటూ ఫ్లెక్సీలపై కనిపించిన రాతలు చర్చనీయాంశంగా మారాయి. నాన్‌ లోకల్‌ అంటూ అసమ్మతి నేతలు పడమట సురేష్‌, తుమ్మల చంద్రశేఖర్‌ ఈ ఫ్లెక్సీలు పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు, పెనమలూరు టికెట్‌ మహిళకు ఇవ్వాలని.. కంకిపాడులోనూ ఫ్లెక్సీలు వెలియడం విశేషం.