Trinethram News : హైదరాబాద్: నగరంలో అనధికారిక సైరన్లు మార్మోగుతున్నాయి. పోలీసు, అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలకు మాత్రమే ఇవి ఉండాలి. ధ్వని కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా నేతల వాహనాలకు సైరన్లు పెట్టకూడదని కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టం చేసింది. కానీ వాటిని బేఖాతరు చేస్తూ నేతలు తమ వాహనాలకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. రద్దీ వేళల్లో ట్రాఫిక్ సమస్య నుంచి బయటపడేందుకు సైరన్లు మోగిస్తూ ముందుకెళ్తున్నారు. ఎన్నికలకు ముందు నిఘా పెట్టి జరిమానాలు విధించిన ట్రాఫిక్ పోలీసులు.. ప్రస్తుతం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా బడా బాబులు తమ కార్లకు వాటిని అమర్చుతున్నారు. సాధారణంగా ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు.. సైరన్ శబ్దం వినిపిస్తే అత్యవసరమని భావించి ముందున్న వాహనదారులు దారి ఇస్తారు. దీన్ని ఆసరాగా తీసుకొని ట్రాఫిక్ రద్దీ వేళ, సిగ్నళ్ల వద్ద వాటిని మోగిస్తూ ముందుకెళ్తున్నారు. ఆకతాయిలు సైతం తమ కార్లు, ద్విచక్ర వాహనాలకు వాటిని బిగించుకుని యథేచ్ఛగా చక్కర్లు కొడుతున్నారు. నగరంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో అంబులెన్సులు, పోలీసు, వీఐపీల వాహనాలు తిరుగుతుంటాయి.
● అత్యవసర వాహనాలకే అనుమతి..
గతంలో విచ్చలవిడిగా ఉపయోగించేవారు. దీంతో సాధారణ ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. వీటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం.. అత్యవసర వాహనాలకు మాత్రమే వాటిని ఉపయోగించాలని స్పష్టం చేసింది. దాంతో చాలావరకు ప్రభుత్వ, వీఐపీల వాహనాలకు ఉండే సైరన్లు తొలగించారు. పోలీసులు దాడులు నిర్వహించి చాలామందికి జరిమానాలు విధించారు. ప్రస్తుతం నగరంలో మళ్లీ సైరన్ల మోత మోగుతోంది. గూబ గుయ్‌మంటోంది.