
పూర్వ ఉపకులపతి జార్జ్ విక్టర్ కు ఉగాది పురస్కారం ప్రదానం
Trinethram News : రాజానగరం: ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఉగాది పురస్కార వేడుకలు మరియు ఆదర్శ విశ్వవిద్యాలయం – నూతన విద్యా విధానం అనే అంశంపై అతిథి ఉపన్యాస కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీ ఆచార్య ఎస్. ప్రసన్నశ్రీ, నన్నయ విశ్వవిద్యాలయ పూర్వ వీసీ ఆచార్య పి. జార్జ్ విక్టర్ హాజరై నన్నయ విగ్రహానికి పూలమాల వేసి, జ్యోతిప్రజ్వలన చేసి వేడుకలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ కుటుంబ సభ్యులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని బొమ్మరిల్లు లాగా తీర్చిదిద్దిన మహోన్నత వ్యక్తి, రూపశిల్పి, కృషీవలుడు ఆచార్య పసలపూడి జార్జ్ విక్టర్ అని కొనియాడారు. ఫ్రొఫెసర్ జార్జ్ విక్టర్ వైస్ ఛాన్సలర్ గా కాకుండా సైట్ ఇంజనీర్ గా వర్క్ చేశారు చెప్పారు. వారు నాటిన మొక్కలు నేడు చెట్లుగా విశ్వవిద్యాలయ కుటుంబానికి నీడను ఇస్తున్నాయని అభినందించారు. తాను ఫిబ్రవరి 20వ తేదీన బాధ్యతలు తీసుకున్నానని, నాటి నుండి విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నానని అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థుల యోగ క్షేమాలు చూడాలనే ఉద్దేశంతో ప్రతికూల పరిస్థితులు ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లాడ్జి లోనే ఉంటున్నానని అన్నారు. విశ్వవిద్యాలయంలో ఆయా విభాగాల్లో చక్కని పనితీరు కనపరచిన సిబ్బందికి ఉగాది పురస్కారాలు అందించి ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు.
విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య జార్జ్ విక్టర్ మాట్లాడుతూ జర్మన్ తత్వవేత్త హెగెల్ చెప్పినట్టు ప్రపంచాన్ని వివేకమే నడిపిస్తుందని అన్నారు. ఆత్మ, పరమాత్మ, వివేకం పేరు ఏదైన మంచిని చేస్తూ ముందుకు సాగితే మంచే జరుగుతుందని చెప్పారు. విద్యాపరమైన, ఆదర్శవంతమైన దృక్పథం ఉన్న ప్రసన్నశ్రీ ఆదికవి నన్నయ విశ్వవిదాలయానికి వీసీ గా సేవలందించడం హర్షనీయమన్నారు. ఆదర్శ విశ్వవిద్యాలయం – నూతన విద్యా విధానం పై ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. నూతన విద్యా విధానంలో భారతీయ సాంస్కృతిని ప్రతిబింబించే అంశాలను జోడించాలని, అలాగే గ్లోబల్ విజ్ఞానాన్ని మన విద్యార్థులకు అందించాలని తెలియజేశారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానంతో పాటు మానవ విలువలు గల హ్యూమానిటీస్ పాఠ్యాంశాలు విద్యార్థులు ఆప్షన్స్ గా ఎంచుకోవాలన్నారు. 1980 జనవరి 22 టీచర్ వృత్తిని చేపట్టానని నేటి వరకు నిజాయితీగానే బ్రతికానని, టీచర్ ఉద్యోగం చేస్తున్నవారికి డబ్బు ప్రధానం కాకూడదన్నారు. టీచర్లు పాఠాలు చెప్పడమే ప్రధాన లక్ష్యంగా పని చేయాలని హితవు పలికారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో చెట్లు బెనారస్ యూనివర్సిటీ మోడల్ ఆధారంగా నాటామని, విశ్వవిద్యాలయంలో ప్రతి నిర్మాణం వెనుక చక్కని నేపథ్యాం ఉందని గుర్తుచేశారు. ఆంధ్ర యూనివర్సిటీ రెసిడెన్షియల్ యూనివర్సిటీ సర్వేపల్లి రాధాకృష్ణన్, సి.ఆర్.రెడ్డి వంటి మహనీయులు వైస్ ఛాన్సలర్స్ గా సేవలందించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మన ఆలోచన విధానాలు మారాలని అన్నారు. యూనివర్సిటీలో ఫారన్ లాంగ్వేజ్ లపై డిప్లొమా కోర్సులు ఏర్పాటు చేయాలని సూచించారు.
తర్వాత విశ్వవిద్యాలయం తరపున ఆచార్య జార్జ్ విక్టర్, శిరోమణి దంపతులను శాలువాలతో సన్మానించి ఉగాది పురస్కార సన్మాన పత్ర జ్ఞాపికను అందజేసి అభినందించారు. అలాగే విశ్వవిద్యాలయంలో చక్కని పనితీరు కనపరచిన నాన్ టీచింగ్ సిబ్బందికి పురస్కారాలు అందించారు. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాల నుండి వి.జి.ఆర్.శేఖర్, పి.ఎ. రవి కిరణ్, కె. శివ రంజని, షెక్ బాబ్జీ, పి ప్రేమ్‌చంద్, కె. దేవలాల్, ఎం.సిహెచ్. దుర్గారావు, పి. గోవింద రాజులు, పి. సోమ రాజు, ఎస్. దుర్గా ప్రసాద్, బి. రాఘవులు, పి. శ్రీను, ఎస్. నాగేశ్వరరావు, యు.శ్రీను బాబు, ఎ. కిరణ్ కుమార్, పి. వీర లక్ష్మి, వై. దుర్గా ప్రసాద్, బి. నరసింహ మూర్తి, ఎండి మల్లిక, షేక్ బేబీ, పి.రాజీవ్, జి. సూర్య కుమారి, కరీం తదితరులను సన్మానించి పురస్కార జ్ఞాపికలను అందించారు.
కార్యక్రమ ప్రారంభోత్సవానికి ముందు విశ్వవిద్యాలయ చాళుక్య ద్వారం వద్ద నన్నయ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే కేంద్ర గ్రంథాలయం ఎదురుగా ఉన్న డా.బి.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, విశ్వవిద్యాలయ అధికారులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
