AP Election 2024 Counting Update: Postal Panchayat in AP, total results after midnight!
ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన బ్యాలెట్ ఓట్లు అనేక వివాదాలకు కారణమవుతున్నాయి. అదే టైంలో లెక్కింపుపై కూడా ప్రభావం చూపబోతున్నాయి. అర్థరాత్రి దాటిన తర్వాత పూర్తి ఫలితాలు వచ్చే ఛాన్స్.
ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ల (Postal Ballot) వివాదం నానాటికి ముదురుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో బ్యాలెట్ ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదున్నర లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ప్రతి పోస్టల్ బ్యాలెట్‌పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా, కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా, ఆర్వో సీల్ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సానుకూలంగా స్పందించిన ఈసీ.. ఆర్వో సంతకం, సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని ఆదేశాలిచ్చింది.
- వైసీపీ అభ్యంతరం ..
పోస్టల్ బ్యాలెట్‌ను తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే లోపలి కవర్ తెరవకుండా తిరస్కరించాలని, అది కూడా ఫారం-13ఏలోని డిక్లరేషన్, ఫారం-13సీ లోని కవర్ బీ లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చంటూ ఈసీ సూచించింది. అలాగే డిక్లరేషన్‌పై ఓటర్లు సక్రమంగా సంతకం చేయకపోయినా, లోపభూయిష్టంగా ఉన్నా తిరస్కరించవచ్చని తెలిపింది. అంతేతప్ప ఆర్వో సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయంపై అధికార వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం చెబుతున్నారు. ఎన్డీఏ నేతల విజ్ఞప్తి తర్వాత ఈసీ నిబంధనలు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపుపై ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా ఇచ్చిన ప్రత్యేక గైడ్ లైన్స్‌పై అభ్యంతరం తెలిపారు.
- ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు?
గెజిటెడ్ అధికారం సంతకం పెట్టి స్టాంప్ వేయాలని గతంలో చెప్పారని, ఇప్పుడు కొత్తగా స్టాంప్ వేయకపోయినా సరే ఆమోదించాలని ఎలా చెబుతారని మాజీ మంత్రి పేర్ని నాని అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఎందుకు తీసుకొచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈసీ ఇచ్చిన ఆదేశాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉందని, ఈ నిబంధనలపై పునరాలోచించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్‌లో లేని సడలింపులతో కూడిన మార్గదర్శకాలు జారీ చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైసీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఇక కౌంటింగ్ కేంద్రాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య ఎన్ని యుద్ధాలు చూడాల్సి ఉంటుంది. అభ్యంతరాలతో ఓట్ల లెక్కింపు అంత సులువుగా, వేగంగా జరగదనే వాదన వినిపిస్తోంది.
- ఓట్ల లెక్కింపు చుక్కలే..!
సాధారణంగా ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తరువాత ఈవీఎం కంట్రోల్ యూనిట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు, కంట్రోల్ యూనిట్ లెక్కింపునకు 30 నిమిషాల సమయం ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లను వేర్వేరుగా లెక్కించినా ఫలితాలు లెక్కింపు వేగంగా చేపట్టడం అంత సులువు కాదు. అధికారుల లెక్కల ప్రకారం ఈవీఎంలు ఒక్కో రౌండు లెక్కించడానికి సగటున 25 నిమషాల సమయం పట్టవచ్చు. కొన్ని రౌండ్లు 25 నిమిషాలలోపే పూర్తయ్యే అవకాశం ఉంది.
- అర్ధరాత్రి దాటాకే క్లారిటీ ..
ఒక్కో నియోజకవర్గం ఈవీఎంల లెక్కింపునకు 8 నుంచి 10 గంటల సమయం పడుతుంది. మధ్యాహ్నం భోజన విరామం ఒక గంట సమయం తీసివేస్తే సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కంట్రోల్ యూనిట్ల లెక్కింపు జరుగుతుంది. బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు మరో రెండు నుంచి మూడు గంటలు సమయం పడితే రాత్రి 11 గంటలకు కూడా లెక్కింపు పూర్తయ్యే అవకాశాలు లేవు. కొన్ని నియోజకవర్గాల్లో హోరాహోరీ పోటీ ఉండే అవకాశం ఉండడంతో వాటిలో చివరి రౌండు ముగిసే వరకు ఫలితం తేలని పరిస్థితి ఉంటుంది. కౌంటింగ్ ప్రక్రియ అంతా పూర్తి చేసి తుది ఫలితాలు రావడానికి అర్ధరాత్రి అయ్యే అవకాశం ఉంది.
- ఆర్వోలదే బాధ్యత ..
పోస్టల్ బ్యాలెట్లు చెల్లకపోతే ఆ బాధ్యత రిటర్నింగ్ అధికారులదేనని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ (కేఆర్సీ) అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఓట్లు చెల్లకపోవడం ఎన్నికల ప్రక్రియలో లోపంగా పరిగణించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడి ఉద్యోగులు బాధ్యతగా ఓటు వేశారని, ఆ ఓటు చెల్లదంటే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను సరళతరం చేయాల్సిన అవసరం ఉందని సూర్యనారాయణ డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App