E. coli: ఈ ‘సూపర్ బగ్’ బాక్టీరియా ప్రాణాలు తీస్తుంది… ఫుడ్ విషయంలో కాస్త జాగ్రత్త
అమెరికాలో మాంసం విక్రయాలు జరిపే ఓ కంపెనీ దాదాపు 3,000 కిలోల మాంసాన్ని మార్కెట్ నుంచి వెనక్కి రప్పించింది. ఆ మాంసంలో ప్రాణం తీసే బ్యాక్టీరియా ఉందనే భయాలే అందుకు కారణం.
ఇక, గతవారం బ్రిటన్ హెల్త్ ఏజెన్సీ కూడా పాల నుంచి తయారు చేసిన చీజ్‌ను మార్కెట్ నుంచి వెనక్కి రప్పించాలని ఓ కంపెనీని ఆదేశించింది.
ఆ చీజ్ తిన్న తర్వాత కొందరు అనారోగ్యానికి గురికావడంతో ఈ చర్యలు తీసుకుంది. ఈ చీజ్ తినడం వల్ల 30 మందికిపైగా జబ్బు పడ్డారు. స్కాట్లండ్ ఒక మరణం కూడా నమోదైంది.
అమెరికా, బ్రిటన్ మార్కెట్ల నుంచి మాంసం, చీజ్‌ను రీకాల్ చేసేందుకు కారణమైన ప్రాణాంతక బ్యక్టీరియా పేరు ఎస్చెరిచియా కోలి. దానిని ఈ.కోలి బ్యాక్టీరియాగా వ్యవహరిస్తారు.
ఈ.కోలి బ్యాక్టీరియాను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ‘సూపర్‌బగ్’గా పేర్కొంది. ఇన్ఫెక్షన్ల వచ్చే వ్యాధులకు వాడే యాంటీబయాటిక్స్, ఇతర ఔషధాలను ఇవి ఎదుర్కొనే శక్తి కలిగిన బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, పారాసైట్లను సూపర్‌బగ్‌గా వ్యవహరిస్తారు.
గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా ఈ.కోలి ఆ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.
ఇండియాలోనూ మరణాలు
భారత్‌లో కూడా బాక్టీరియా మరణాలకు ఈ.కోలి ఒక ప్రధాన కారణం. బ్యాక్టీరియాతో సంభవిస్తున్న మరణాల్లో ఈ.కోలి అగ్రస్థానంలో ఉందని ప్రముఖ మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది.
లాన్సెట్‌లో కథనం ప్రకారం, 2019లో భారత్‌లో ఈ.కోలి బ్యాక్టీరియా కారణంగా 1,57,000 మంది చనిపోయారు.
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం, ”ఈ బ్యాక్టీరియా కారణంగా ఎవరైనా అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నప్పటికీ, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధుల్లో ప్రాణాంతకంగా మారే అవకాశాలు ఎక్కువ.”
”భారత్‌లో డయేరియా కారణంగా చనిపోయిన ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలకు ఈ.కోలి బ్యాక్టీరియా కూడా ఒక కారణం” అని డబ్ల్యూహెచ్‌వో నివేదిక చెబుతోంది.
అసలేంటీ ఈ.కోలి… ఎలా వ్యాపిస్తుంది?
”పేగుల్లో ఉండే ఈ.కోలి బ్యాక్టీరియాలో చాలా రకాలు అంత ప్రమాదకరమైనవి కావు, కానీ కొన్ని రకాలు మాత్రం ప్రమాదకరం” అని హిమాచల్ ప్రదేశ్‌లోని సుందర్‌నగర్‌లో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి మెడికల్ కాలేజీలో పాతాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జి, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కమల్ ప్రీత్ చెప్పారు.
”మనుషులు, జంతువుల ప్రేగులు లేదా పర్యావరణంలో ఎక్కడైనా ఈ.కోలి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది కలుషిత ఆహారం, నీటితో పాటు అప్పటికే బ్యాక్టీరియా సోకిన జంతువులు, మనుషుల ద్వారా వ్యాప్తి చెందుతుంది” అని ఆమె తెలిపారు.
సాధారణంగా ఈ.కోలి బ్యాక్టీరియా మన ప్రేగుల్లో ఉంటుందని, దాని వల్ల ఎలాంటి హాని ఉండదని దిల్లీకి చెందిన డాక్టర్ వినోద్ కుమార్ గోయల్ అన్నారు. కానీ, కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందన్నారు.
బ్యాక్టీరియా రక్తంలో సెప్టిసీమియా తీవ్రమైన ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది.
”బ్యాక్టీరియాతో కలుషితమైన నీటిని తాగడం, పచ్చి మాంసం లేదా సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి కూరగాయలు తినడం వంటివి బ్యాక్టీరియా వ్యాప్తికి ప్రధాన కారణాలు. ఇంకా పచ్చి పాలు, దాని నుంచి తయారైన పాల ఉత్పత్తులను తీసుకోవడం ద్వారా కూడా ఈ.కోలి బారిన పడే అవకాశం ఉంది” అని డాక్టర్ కమల్‌ప్రీత్ చెప్పారు.
అమెరికాలో మాంసం, యూకేలో చీజ్‌ను రీకాల్ చేయడానికి ఇదే కారణంగా కనిపిస్తోంది.
”ఫుడ్ పాయిజనింగ్ కారణమయ్యే కొన్ని స్ట్రైన్స్ (వేరియంట్లు) కలిగిన ఈ.కోలి బ్యాక్టీరియాలున్నాయి. అవి ఆహారాన్ని విషపూరితం చేస్తాయి. అలా విషపూరితమైన ఆహారం తినడం వల్ల జబ్బునపడే ప్రమాదం ఉంది. అలాంటి సందర్భాల్లో సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది” అన్నారామె.
లక్షణాలు, ప్రమాదాలు
నిరుడు సెప్టెంబర్‌లో అల్బెర్టా, కెనడాలో చిన్నారుల్లో ఈ.కోలి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందాయి. పదకొండు డే కేర్ సెంటర్లకు చెందిన దాదాపు 250 మందికి పైగా చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. వారిలో ఆరుగురికిపైగా చిన్నారులకు కిడ్నీ ఫెయిల్ కావడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది.
ఈ చిన్నారులు ఈ.కోలి బ్యాక్టీరియా బారిన పడినట్లు విచారణలో తేలింది. వారందరికీ ఒకేచోటు నుంచి ఆహారం సరఫరా అయింది.
దీన్ని బట్టి ఈ బ్యాక్టీరియా ఎంత ప్రమాదకరమో అంచనా వేయొచ్చు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, ”ఈ.కోలి బ్యాక్టీరియాకి చెందిన ఏ స్ట్రెయిన్ రకం ‘శిగా’ అనే టాక్సిన్(విషపదార్థం)ను విడుదల చేస్తుంది. ఇది ప్రమాదకర వ్యాధులకు కారణమవుతుంది. ఈ స్ట్రెయిన్‌ను ఎస్‌టీఈసీగా వ్యవహరిస్తారు.
కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్(యూటీఐ)ను దారితీస్తుందని, మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని డాక్టర్ కమల్‌ప్రీత్ చెప్పారు.
”బ్యాక్టీరియా సోకకుండా ఉండేందుకు మహిళలు తమ ప్రైవేటు భాగాలను ముందు నుంచి వెనుక వరకు శుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా మలంలో కనిపించే బ్యాక్టీరియా వల్ల వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి” అని ఆమె సూచించారు.
బ్యాక్టీరియా సోకిన మనుషులు, లేదా జంతువుల మలం ద్వారా కలుషితమైన సరిగ్గా ఉడకని మాంసం, పచ్చి కూరగాయలు, పాల ద్వారా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి చెందుతాయి.
ఎక్కువ సందర్భాల్లో ఇలాంటి వ్యాధులు వాటంతట అవే తగ్గుతాయి. కానీ కొన్నిసార్లు మాత్రం ప్రాణాంతకంగా మారతాయి.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నారులు, వృద్ధులకు ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ.
సోర్స్: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)
ఎలాంటి జాగ్రత్తలు అవసరం
అమెరికా ప్రభుత్వ ఆరోగ్య సంస్థ ‘సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ నియంత్రణ’ (సీడీసీ) ప్రకారం, గర్భిణులు, అప్పుడే పుట్టిన శిశువులు, చిన్నారులు, వృద్ధులతో పాటు క్యాన్సర్, డయాబెటిస్, హెఐవీ/ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల వంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో ఆహారం కారణంగా వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువ. అలాంటి వారిలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల, వీలైనంత వరకూ బ్యాక్టీరియా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవడం లేదా లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్తపడడం ఉత్తమం.
”ఆహారం వండే ముందు, తినే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. టాయిలెట్‌కి వెళ్లొచ్చిన తర్వాత కూడా చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
ఇంట్లో వంట గదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆహారాన్ని బాగా ఉడికించాలి. అలాగే పాలు కాగబెట్టుకోవాలి. మాంసం బాగా ఉడికేంత వరకూ వండాలి. ఎందుకంటే, ఈ బ్యాక్టీరియా వేడికి తట్టుకోలేదు” అని డాక్టర్ కమల్ ప్రీత్ అన్నారు.
”ఒకవేళ సలాడ్ తినాలనుకుంటే, కూరగాయలు, పండ్లను మంచినీటితో శుభ్రంగా కడుక్కోవాలి. వాటిపై కలుషిత నీటిని చల్లే అవకాశం ఉంటుంది కాబట్టి శుభ్రం చేసుకోవాలి” అన్నారు.
WHO సూచనలు
ఈ.కోలి బ్యాక్టీరియాను నివారించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఐదు టిప్స్ సూచించింది.
శుభ్రత పాటించడం.
పచ్చి ఆహారం, వండిన ఆహారాన్ని వేర్వేరుగా ఉంచడం.
ఆహారాన్ని బాగా వండడం.
ఆహారాన్ని తగిన ఉష్టోగ్రతలో ఉంచడం.
శుభ్రమైన నీటిని, శుభ్రం చేసిన పచ్చి ఆహారం, వస్తువులను వాడడం.
ఈ.కోలి బ్యాక్టీరియా కారణంగా ఇన్ఫెక్షన్ సోకితే కనిపించే లక్షణాలను డాక్టర్ వినోద్ కుమార్ గోయల్ వివరించారు.
”డయేరియా ప్రధాన లక్షణం. అలాగే, మలంతో పాటు రక్తం పడే అవకాశం. ఆహారం, లేదా నీళ్లు తీసుకున్నప్పుడు వాంతులు అవ్వడం, తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్ కనిపిస్తాయి. నిలబడలేనంత నీరసంగా ఉంటుంది. మీకు యూటీఐ సోకితే, మూత్రంలో రక్తం పడే అవకాశం కూడా ఉంటుంది” అని ఆయన చెప్పారు.
”తీవ్రమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. సొంత వైద్యం పనికిరాదు. అలా చేయడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఈ బ్యాక్టీరియాపై చాలా యాంటీబయాటిక్స్ పనిచేయలేవు. అందువల్ల వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం డాక్టర్ చికిత్స అందిస్తారు” అని డాక్టర్ కమల్ ప్రీత్ అన్నారు.