Trinethram News : అమరావతి: తెలుగుదేశం, భాజపా, జనసేన మధ్య పొత్తులపై స్పష్టత రావడంతో ఏ స్థానంలో ఎవరు పోటీ చేస్తారనే చర్చ జోరందుకుంది. తెదేపా, జనసేన ఇప్పటికే తొలి జాబితాలో 99 అసెంబ్లీ స్థానాలను ప్రకటించడంతో..
మిగతా 76 చోట్ల ఎవరు ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై నేతల్లో ఉత్కంఠ నెలకొంది. పొత్తులో భాగంగా భాజపా, జనసేన పోటీ చేసే 8 లోక్‌సభ స్థానాలు ఏవనే సందిగ్ధత కొనసాగుతోంది.
భాజపా, జనసేన కలిసి 30 అసెంబ్లీ, 8 లోక్‌సభ స్థానాల్లో ఎవరెక్కడ పోటీ చేయనున్నాయనే అంశం ఆసక్తి రేపుతోంది. తెలుగుదేశం, జనసేన ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించని 76 స్థానాల్లో తమకు చోటు ఉంటుందో? లేదో? అనే ఉత్కంఠ ఆశావహుల్లో నెలకొంది. తమ స్థానం చేజారకుంటే చాలని, మలిజాబితా ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. అరకు, అనకాపల్లి, కాకినాడ, నరసాపురం, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట స్థానాలను భాజపా – జనసేన దక్కించుకోవచ్చనే ప్రచారం సాగుతోంది..
రంగంలోకి కేంద్రమంత్రి షెకావత్
తమకు కేటాయించిన 24 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటికే ఐదుగురు అభ్యర్థుల్ని ప్రకటించిన జనసేన.. రాజోలులోనూ పోటీ చేస్తున్నట్టు ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు భాజపా అభ్యర్థుల ఎంపికపై కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ రంగంలోకి దిగారు. ఆదివారం విజయవాడ చేరుకున్న ఆయన రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో పాటు నేతలతో చర్చిస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోగా అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం..
పొత్తుతో ముడిపడి ఉన్న స్థానాలివే..
తెలుగుదేశం, జనసేన ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించని జాబితాను పరిశీలిస్తే.. ఉత్తరాంధ్రలో పలాస, పాలకొండ, విశాఖ ఉత్తరం, దక్షిణం, భీమిలి, యలమంచిలి, పెందుర్తి, మాడుగుల స్థానాలు పొత్తుతో ముడిపడి ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని పిఠాపురం, కాకినాడ అర్బన్, రామచంద్రాపురం, గన్నవరం, అమలాపురం, పోలవరం, నరసాపురం, నిడదవోలు, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం స్థానాల్లో కొన్నింటిలో జనసేన, భాజపాలు పోటీచేయవచ్చని సమాచారం. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో కైకలూరు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, గుంటూరు నగరంలోని ఒక స్థానం, దర్శి వంటివి పొత్తుతో ముడిపడే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. రాయలసీమ జిల్లాల్లోని శ్రీకాళహస్తి, మదనపల్లి, అనంతపురం, కదిరి, ధర్మవరం, రైల్వే కోడూరు, జమ్మలమడుగులో ఏయే స్థానాలు జనసేన, భాజపాకు కేటాయిస్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది..