TRINETHRAM NEWS

Trinethram News : జిల్లాలు మారిస్తే గందరగోళమే

ప్రజలకు మళ్లీ జిల్లా అధికారులు దూరం
జిల్లా కేంద్రంలో తగ్గనున్న క్యాడర్‌స్ట్రెంత్‌
ఉద్యోగుల పంపకాలు మళ్లీ మొదటికి
ప్రక్రియ పూర్తి కావడానికి రెండేండ్లు

అప్పటిదాకా నోటిఫికేషన్లు రాక నిరుద్యోగులకు అన్యాయం
ప్రభుత్వంలో తగ్గిపోనున్న ప్రజాప్రతినిధుల సంఖ్య
అలంకారప్రాయంగా మారనున్న సమీకృత కలెక్టరేట్లు

హైదరాబాద్‌, జనవరి 7 రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడతామని, వాటి సంఖ్యను తగ్గిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అటు నిపుణులను, ఇటు సామాన్యులను విస్మయానికి గురిచేస్తున్నాయి. పది జిల్లాలుగా ఉన్న తెలంగాణను కేసీఆర్‌ ప్రభుత్వం అనేక చర్చోపచర్చలు, తర్జనభర్జనలు, ప్రజాభిప్రాయ స్వీకరణ అనంతరం 33 జిల్లాలుగా విస్తరించింది. కొత్త జిల్లాల కేంద్రంగా పాలన సవ్యంగా సాగుతున్నది. ఇప్పుడు మళ్లీ జిల్లాల సంఖ్యను కుదిస్తే కొత్త సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త, చిన్న జిల్లాలతో ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైందని, కలెక్లర్ల ప్రత్యక్ష పర్యవేక్షణ పెరిగిందని, ప్రజా సమస్యలు వేగంగా పరిష్కారం అవుతున్నాయని చెప్తున్నారు.

అన్ని శాఖలకు జిల్లా స్థాయి అధికారులు ఉండటంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు చేరుతున్నాయని అంటున్నారు. ఎస్పీ కార్యాలయాలు పెరగడంతో నేరాలు గణనీయంగా తగ్గాయని ఉదహరిస్తున్నారు. ఒకప్పుడు ప్రజలు జిల్లా అధికారులను కలవాలంటే వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చేదని, ఒకటి రెండు రోజులు సమయం వృథా అయ్యేదని గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం 50-80 కిలోమీటర్ల దూరంలోనే జిల్లా కేంద్రం అందుబాటులోకి వచ్చిందని, ఒక్క రోజులోనే పని పూర్తవుతున్నదని చెప్తున్నారు.

ఎందుకు.. ఏమిటి.. ఎలా?

జిల్లాల సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నది నిపుణుల మొదటి ప్రశ్న. జిల్లా కేంద్రాలు అభివృద్ధికి చిహ్నాలని, విద్య, ఉద్యోగ, పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలు కలుగుతుందని చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు జనాభా, జనసాంద్రత, భౌగోళిక విస్తీర్ణం, ఆ ప్రాంత ప్రజల జీవనశైలి, ప్రజల నుంచి వచ్చే డిమాండ్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో జరిగిన కొత్త జిల్లాల ఏర్పాటులో ఇలాంటి పద్ధతే పాటించారు. ఏపీలో ఇటీవల జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని జిల్లాగా ఏర్పాటు చేశారు. సీఎం ప్రతిపాదిస్తున్న పునర్విభజన లేదా పునరేకీకరణకు ప్రతిపాదిక ఏమిటనేది ఇంకా స్పష్టత రాలేదు. 2026లో నియోజకవర్గాల పునర్విభజన ఉన్నదని, మరి అప్పుడు కూడా మళ్లీ కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు.

ఎన్నో చిక్కులు

కొత్త జిల్లాల ఏర్పాటు లేదా జిల్లాల తగ్గింపు సులభం కాదని విశ్లేషకులు చెప్తున్నారు. ఉద్యోగుల సర్దుబాటు కష్టమవుతుందని స్పష్టం చేస్తున్నారు. జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన పూర్తయిందని, క్యాడర్‌ స్ట్రెంత్‌ నిర్ణయం అయ్యిందని, కొత్త జిల్లాలతో మళ్లీ మొదటికి వస్తుందని అంటున్నారు. ఎన్ని జిల్లాలు తగ్గిస్తే.. అదే సంఖ్యలో కలెక్టర్‌ పోస్టులు, హెచ్‌వోడీలు, ఆయా కార్యాలయాల్లో పనిచేసే అటెండర్ల వరకు అన్ని పోస్టులు రద్దు అవుతాయని చెప్తున్నారు. ఫలితంగా ఉన్నతాధికారుల సంఖ్య భారీగా పడిపోతుందని, ఇప్పుడు పదోన్నతులు వేగంగా వస్తున్నాయని, జిల్లాల సంఖ్య తగ్గితే ఆలస్యం అవుతాయని వివరిస్తున్నారు.

జిల్లాలతో ముడిపడిన అంశాలు

జిల్లాల ఏర్పాటుతో జోన్ల విభజన కూడా జరగాల్సి వస్తుంది. ఇవన్నీ అధికారికంగా అమల్లోకి రావాలంటే కేంద్రంతోపాటు రాష్ట్రపతి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి కనీసం ఒకటి రెండేండ్లు పడుతుంది. అప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్లు వేయడానికి ఆస్కారం ఉండదు. ఫలితంగా నిరుద్యోగులు నష్టపోతారు.
ఇప్పటికే అన్ని జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు నిర్మితమయ్యాయి. ఇతర అనుబంధ భవనాలు కూడా వచ్చాయి. జిల్లాల సంఖ్యను తగ్గిస్తే ఇవన్నీ వృథాగా మారిపోతాయి.
కొత్త జిల్లాలతో జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్‌ వంటి ప్రజాప్రతినిధుల సంఖ్య కూడా పెరిగింది. అనుబంధంగా వచ్చిన జెడ్పీ సీఈవో, అన్ని విభాగాల్లో ఎస్‌ఈలు, ఇతర క్యాడర్‌ స్ట్రెంత్‌ మొత్తం రద్దు అవుతాయి.
రాజకీయంగానూ జిల్లాల సంఖ్య తగ్గించడం పార్టీలకు ఇబ్బంది కలిగిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. జిల్లాల వారీగా పార్టీలు అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అనుబంధ కమిటీలు ఇలా వందలాది మందికి ప్రాతినిధ్యం కల్పించాయి. వారంతా ఇప్పుడు పదవులు కోల్పోయే అవకాశం ఉంటుంది.
జిల్లాలు కేంద్రంగా ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు గందరగోళంలో పడతాయి. ఉదాహరణకు జిల్లాకో మెడికల్‌ కాలేజీ చివరి దశకు చేరింది. ఈ ఏడాది అనుమతులు వస్తే ప్రతి జిల్లాలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పడుతుంది. ఇప్పుడున్న జిల్లా దవాఖానలను మెడికల్‌ కాలేజీలకు అనుగుణంగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నారు. వాటికి అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలని గతంలోనే నిర్ణయించారు. ఇలాంటి పథకాలు ఇప్పుడు గందరగోళంలో పడతాయని నిపుణులు చెప్తున్నారు. మొత్తంగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ ఆలోచనతో ప్రయోజనం దాదాపు శూన్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం చేకూర్చినట్టవుతుందని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.