
మెదక్: స్కూల్ బస్సు కిందపడి చిన్నారి మృతి చెందిన ఘటన పట్టణ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీలో మంగళవారం చోటు చేసుకుంది. అనుశ్రీ (6) తల్లిదండ్రులు బిక్షపతి, నవీన బొంతపల్లిలో ఉంటారు. హౌసింగ్‌బోర్డులో నివాసముంటున్న పిన్ని, బాబాయి వద్ద ఉంటూ బాలిక.. స్థానిక మాస్టర్ మైండ్ స్కూల్‌లో ఒకటో తరగతి చదువుతోంది. రోజు మాదిరిగానే స్కూల్ కు వెళ్లిన చిన్నారి సాయంత్రం ఇంటి వద్ద దిగి బస్సు ముందు నుంచి వెళ్తున్న క్రమంలో డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతో టైరు కిందపడి మృతి చెందింది. ఘటన జరిగిన వెంటనే డ్రైవర్, క్లీనర్ అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహించిన స్థానికులు బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
