పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పుష్కరించాలి
పారిశుద్ధ కార్మికుల సమ్మెకు జై భీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ) సంపూర్ణ మధ్ధతు. దీర్ఘకాలంగా నెలకొన్న పారిశుద్ధ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని జై భీమ్ రావు భారత్ పార్టీ (జేబీపీ) పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పారిశుద్ధ్య కార్మికులు నాలుగు రోజులుగా చేస్తున్న సమ్మెకు శుక్రవారం మధ్యాహ్నం ఆయన మద్దతు ఇచ్చి మాట్లాడారు. గతంలో ఎన్నికల సమయంలో ప్రతిపక్ష హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించి సమాన పనికి సమాన వేతనం తదితరు డిమాండ్లను అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే అమలు చేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నాలుగున్నర సంవత్సరాలైనప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టారని హామీని నిలబెట్టుకొవాలని ఆయన సూచించారు. తొలుత పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ నాయకులు నినాదాలు చేశారు.కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మాతంగి సుధాకర్ రావు నాయకులు మహంకాళి వెంకట్రావ్, వర్ల వెంకటేశ్వర్లు, జడ కమల్ కుమార్, నందిగామ గురువయ్య, చిట్టిబాబు, చెన్నంశెట్టి రామకృష్ణ, బొక్క భాస్కర్ రావు, సిఐటియు నాయకులు హరిపోతురాజు, రాజ్ కుమార్, చింతకుంట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.