TRINETHRAM NEWS

గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా..?

తెలంగాణ గవర్నర్‎గా కొనసాగుతున్న తమిళిసై పై అనేక వార్తలు షికారు చేస్తున్నాయి. గవర్నర్ పదవికి రాజీనామా చేసి త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై తమిళిసై స్పందించారు. తాను ప్రస్తుతం హాయిగా, సంతోషంగా ఉన్నానన్నారు. గవర్నర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జరిగే ప్రచారాన్ని ఖండించారు. అవి పూర్తిగా అవాస్తవం అని వెల్లడించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయొద్దని సూచించారు. తాను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్లు తెలిపారు. అలాంటి రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటే తప్పకుండా ప్రజలందరికీ తెలియజేస్తానన్నారు.

ఈ వార్తలు రావడానికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు. ఇటీవల గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీపై అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై స్పందించిన తమిళిసై ప్రధానిని కలిసి ఎంపీగా పోటీ చేస్తానని ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు అని తెలిపారు. అలాగే తాను ఢిల్లీ వెళ్లలేదని వరద బాధితులను పరామర్శించేదుకు తూత్తూకూడి వెళ్లానని తెలిపారు. తమిళిసై రాజకీయ ప్రస్థానం గమనించినట్లయితే.. గతంలో తమిళనాడు నుంచి రెండు సార్లు లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచి ఓటమి చవిచూశారు.

మొదటి సారి 2009లో చెన్నై నార్త్ నుంచి పోటీ చేయగా.. 2019లో తూత్తూకూడి నుంచి పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచారు. ఆ తరువాత మూడు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలిచినా ప్రజలు ఆదరించలేదు. అయితే ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం తమిళనాడు గవర్నర్‎గా నియమించింది. అలాగే పుదుచ్చేరి లెప్టెనెంట్ గవర్నర్‎గా నియమిస్తూ అదనపు బాధ్యతలను అప్పజెప్పింది. అయితే ఈమధ్య తీవ్రమైన వర్షాల ప్రభావంతో తూత్తూకూడి వరదల్లో చిక్కుకుంది. ఈనేపథ్యంలో అక్కడి ప్రజలను పరామర్శించి సహాయక చర్యలు చేపట్టాలని కోరింది. దీంతో మరోసారి తూత్తూకూడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అన్న అనుమానాలు కొందరిలో కలిగాయి. దీంతో ఈ వార్త వైరల్గా మారింది. తాజాగా తమిళిసై ఇచ్చిన క్లారిటీతో ఈ పుకార్లకు తెరపడినట్లయింది.