
హైదరాబాదులో పుస్తకావిష్కరణ కార్యక్రమం
లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
అప్పట్లో అధికారులు నేతలకు దిశానిర్దేశం చేసేవారని వెల్లడి
తప్పులు చేద్దాం అని చెప్పేవాళ్లే ఎక్కువయ్యారని చమత్కారం
Trinethram News : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాదులో పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎం.గోపాలకృష్ణ రాసిన లైఫ్ ఆఫ్ ఏ కర్మయోగి పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఐఏఎస్ అధికారుల సంఘం కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ గా, మండలి సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఇప్పుడు సీఎంగా అనేకమంది అధికారులను చూస్తూ వస్తున్నానని తెలిపారు. అప్పట్లో అధికారులు ప్రజల మధ్యనే గడిపేవారని అన్నారు. ప్రజాసేవ దిశగా నాయకులకు ఆ అధికారులు దిశానిర్దేశం చేసేవారని వివరించారు.
ప్రజలను ఆనందింపజేసేందుకు నేతలు అనేక హామీలు ఇస్తుంటారని, కానీ ఆ హామీల సాధ్యాసాధ్యాలు, లోటుపాట్లను వివరించి నేతలను సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అలాంటి అధికారులు కనిపించడంలేదని విచారం వ్యక్తం చేశారు.
తప్పు చేయొద్దు అని చెప్పేవాళ్లకంటే… మూడు తప్పులు చేద్దాం అని చెప్పేవారే ఎక్కువగా ఉన్నారని సరదాగా వ్యాఖ్యానించారు. కొత్త అధికారులు సీనియర్లను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. అధికారులు ఏసీ గదుల్లో ఉంటే పాలన ముందుకు వెళ్లదని, అధికారులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని హితవు పలికారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
