TRINETHRAM NEWS

Strong winds in the Bay of Bengal

మరో 48 గంటలపాటు అతి భారీ వర్షాలు!

Trinethram News : హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కళింగపట్నానికి 240 కిలోమీటర్లు, ఒడిశాకు 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. సోమవారం ఉదయం నాటికి ఒడిశా, పశ్చిమబంగ తీరాల్లో తీవ్ర వాయుగుండంగా బలపడింది. అనంతరం పశ్చిమ, వాయువ్య దిశగా ప్రయాణిస్తూ సోమవారం మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

రెండు రోజుల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వైపు ప్రయాణించనుంది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటల్లో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో నేటి నుంచి వరుసగా మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురియవచ్చని తెల్పింది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది

మరోవైపు ఏపీలో సోమ, మంగళవారాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో అధికంగా ఉంటుందని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. సోమవారం ఏలూరు, అల్లూరి, ఉభయ గోదావరి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. గంటకు గరిష్ఠంగా 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేవీఎస్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ గురువారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. కళింగపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టుల్లో మూడో నంబరు హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Strong winds in the Bay of Bengal