కాలంచెల్లిన 76 చట్టాల రద్దు
పార్లమెంటు ఆమోదం
దిల్లీ: కాలంచెల్లిన 76 చట్టాలను రద్దు చేసేందుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. జులైలో లోక్‌సభ సమ్మతి పొందిన ఆమోదించిన బిల్లును బుధవారం రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది
దీంతో ఇది పార్లమెంటు ఆమోదం పొందినట్లయింది. బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ- ‘రాజ్యాంగానికి రూపకర్త పార్లమెంటే. అది చేసే మార్పులే ఫైనల్. దానిలో కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల జోక్యాన్ని అనుమతించేది లేదు’ అని స్పష్టంచేశారు. శాసనాల రూపకల్పనను సభ్యులు ఎంతో సీరియస్‌గా తీసుకోవాలని, ఎవరు జోక్యం చేసుకున్నా తిప్పికొట్టాలని చెప్పారు. ‘చట్టాలు చేసే అధికారం మనకే (పార్లమెంటుకే) ఉంది. అన్ని చట్టాలను రాజ్యాంగ నిబంధనలకు లోబడే రూపొందించాలి. దానిపై సమీక్ష చేసేందుకు న్యాయవ్యవస్థకు వీలుంది. ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించగలిగేది పార్లమెంటు మాత్రమే. బ్యాలెట్ ద్వారా ప్రజలు తమ ఆలోచనలు వ్యక్తంచేసి, ప్రజా ప్రతినిధులను ఇక్కడికి పంపిస్తారు. ప్రజా హక్కులకు, వారి సార్వభౌమత్వానికి అసలైన కాపలాదారులుగా పార్లమెంటు సభ్యులు జాగరూకతతో వ్యవహరించి, చట్టాల రూపకల్పన ప్రక్రియకు దోహదపడాలి. ముఖ్యమైన బిల్లుపై ఒకసారి మనం చర్చిస్తున్నప్పుడు నేను ఏ పక్షం ఏ అభిప్రాయం చెబుతుందోనని అన్ని పక్షాలవైపు చూశాను. దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థ ఈ సభలో 100% మంది ఆమోదాన్ని పొందేలా మధ్యంతర న్యాయ పరిష్కారం చూపగలదా?’ అని ప్రశ్నించారు
ఇప్పటివరకు రద్దయినవి 1,562: న్యాయ శాఖ మంత్రి మేఘ్‌వాల్
ప్రజా జీవితాన్ని సరళతరం చేసేలా 2014 నుంచి ఇప్పటివరకు 1,486 చట్టాలను మోదీ సర్కారు రద్దు చేసిందని, ప్రస్తుత బిల్లులో పేర్కొన్నవాటితో ఆ సంఖ్య 1,562కి చేరుతుందని న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ చెప్పారు.