TRINETHRAM NEWS

ప్రధాన కాలువల్లో పూడికతీతను క్రమం తప్పకుండా చేపట్టండి

  • కమిషనర్ వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్.,

భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా, వరద నీటి ప్రవాహం సాఫీగా సాగేలా అన్ని ప్రధాన కాలువల్లో పూడికతీత పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. స్థానిక కె.వి.ఆర్ పెట్రోల్ కూడలి, మాగుంట లే అవుట్, ముత్తుకూరు రోడ్డు , చిల్డ్రన్స్ పార్క్, నేషనల్ హై వే తదితర ప్రాంతాలను ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగం అధికారులతో కలిసి కమిషనర్ గురువారం పరిశీలించారు. నగర వ్యాప్తంగా అన్ని డివిజనుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులను ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని సూచించారు. డ్రైను కాలువల్లో పూడికతీత, సిల్టు తొలగింపు, వీధుల్లో కూలిన వృక్షాలు, ఇతర వ్యర్ధాలు లేకుండా నిరంతరం చెత్త సేకరణ వాహనాల ద్వారా తరలింపు వంటి చర్యలను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.

వర్షాలకు ముంపుకు గురైన ప్రాంతాల్లో అంటురోగాలు వ్యాపించకుండా బ్లీచింగ్ ప్రక్రియ, దోమల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలూ తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అకాల వర్షాలను సమర్ధంగా ఎదుర్కునేలా అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలనూ తీసుకోవాలని కమిషనర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.