TRINETHRAM NEWS

వైకాపా రౌడీలు, గంజాయి స్మగ్లర్ల పార్టీ అని మరోసారి నిరూపితమైంది: ప్రత్తిపాటి

మాజీమంత్రి కన్నా ప్రచారంపై వైకాపా రాళ్ల దాడిని ఖండించిన ప్రత్తిపాటి

వైకాపా అంటేనే రౌడీలు, గంజాయి బ్యాచ్ పార్టీ అని మరోసారి నిరూపితమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు. మంత్రి అంబటి ప్రోద్బలంతో వైకాపా గుండాలు, గంజాయిమత్తు, అధికారమదంతో తొండపిలో కన్నా లక్ష్మీనారాయణపై చేసిన హత్యాయత్నమే అందుకు నిదర్శమన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం, వారు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా సాగుతున్న ప్రచారంపై రాళ్ల వర్షం కురిపించడం అంటే ప్రజాస్వామ్య ప్రక్రియను కూడా హత్య చేయాలనే దురుద్దేశంతోనే ఈ దాడి చేసినట్లు స్పష్టం అవుతోందని, రౌడీయిజం, భౌతిక దాడులతో ప్రతిపక్షాల్ని భయపెట్టాలని చూస్తున్నారన్నారు ప్రత్తిపాటి. తొండపి ఘటనకు మంత్రి అంబటి, వైకాపా నాయకత్వంతో పాటు స్థానిక పోలీసులదే పూర్తి బాధ్యత అని తెలిపారు ప్రత్తిపాటి. విద్యుత్ సరఫరా నిలిపివేసి మరీ దాడి చేయడం చూస్తుంటే అంతా పథకం ప్రకారమే జరిగిందని, ఈ ఘటనకు బాధ్యులైన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజకీయ ప్రక్రియనే ప్రమాదంలో పడేస్తున్న ఇలాంటి వరస ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం తక్షణం జోక్యం చేసుకోవాలని, కోడ్ వచ్చే వరకు ఆగకుండా ముందే కనీసం పోలీసు వ్యవస్థను వారి నియంత్రణలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు ప్రత్తిపాటి. లేదంటే ప్రతిపక్షాలు లేని ఎన్నికల ప్రక్రియకు అర్థం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటమిభయం, రోజురోజుకీ తెలుగుదేశానికి పెరుగుతున్న ఆదరణను చూడలేక వైకాపా వాళ్లకు తెలిసిన హింసామార్గాన్ని ఎంచుకున్నారని మండిపడ్డారు. వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, జగన్ పాదయాత్ర చేసినప్పుడు నాడు అధికారంలో ఉన్న తెదేపా ఇదే పనిచేసి ఉంటే ఇవాళ వైకాపా మిగిలి ఉండేదా అని ఆయన ప్రశ్నించారు. ఇలా ఎన్ని దాడులు చేసినా, వాళ్లు తలకిందులుగా తపస్సు చేసినా సత్తెనపల్లితో గానీ, రాష్ట్రంలో గానీ వైకాపా గెలిసే ప్రసక్తే లేదన్నారు ప్రత్తిపాటి.