TRINETHRAM NEWS

ఆర్జీవీ తలతెస్తే రూ.కోటి’.. కేసు నమోదు చేసిన పోలీసులు

దర్శకుడు రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రచ్చ కొనసాగుతోంది. వ్యూహం సినిమాను ఆపాలంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు, ఆందోళనలు కొనసాగుతుండగా, హైదరాబాద్‌లో వర్మ కార్యాలయం ఎదుట టెన్షన్ వాతావరణం నెలకొంది. వ్యూహం సినిమాకు వ్యతిరేకంగా కొంతమంది ఆందోళనకు దిగారు. వ్యూహం మూవీ పోస్టర్లను తగలబెట్టారు. సినిమా బ్యాన్ చేయాలని నినదించారు. సమాచారం అందుకున్న పోలీసులు సైతం ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారుల్ని చెదరగొటారు కూడా. నిజానికి ఆర్జీవీ వ్యూహం మూవీపై సెన్సార్‌ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. బెంగళూరులో వ్యూహాం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీస్‌ ఎదుట ఆందోళన జరిగింది. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ సమయంలోనే ఆర్జీవీకి తగినశాస్తి జరగాల్సిందని మండిపడ్డారు ఆందోళనకారులు. చంద్రబాబు ఫ్యామిలీ టార్గెట్‌గా ఆర్జీవీ సినిమాలు తీస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు

‘వ్యూహం’ సినిమా విడుదలపై హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ చిత్రాన్ని ఓటీటీ, ఆన్‌లైన్‌, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు రామదూత క్రియోషన్స్‌, దర్శకుడు రాంగోపాల్‌ వర్మకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్‌ సిటీసివిల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్‌ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్‌, నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్, దర్శకుడు రాంగోపాల్‌ వర్మలను ప్రతివాదులుగా చేర్చారు. చిత్రం విడుదల కాకుండా నిర్మాతను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమా వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అయితే వర్మ తీసే సినిమాలన్ని రాజకీయ కోణంలో ఉండటంతో ఎప్పుడూ కూడా వివాదస్పదంగా మారుతుంటాయి. ఎన్నికల సీజన్ వస్తే చాలు ఆర్జీవీ సినిమాలు వరుసపెట్టి బయటకు వస్తుంటాయి. ఆర్జీవి తీసే సినిమాలు ఎప్పుడూ కూడా కాంట్రవర్సిగా మారుతుటాయి. ఇదిలా ఉండగా, ఈ మూవీ నవంబర్ 10న విడుదుల కావాల్సి ఉండగా, కోర్టు వివాదాలలో చిక్కుకుంది. ఇటీవల ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఆర్జీవీ విజయవాడలో నిర్వహించారు. ఈ నెల 29న ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తే టీడీపీ నేత నారా లోకేష్ కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఈ కేసు విచారణలో ఉంది.ఈ నెల 28కి ఈ కేసు వాయిదా పడింది. ఇదిలా ఉంటే వర్మ కార్యాలయం వద్ద సోమవారం రాత్రి కొందరు టీడీపీ కార్యకర్తలు వెళ్లి నిరసన తెలియచేశారు

దుమారం రేపుతున్న శ్రీనివాసరావు వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో ఈ వ్యూహం సినిమాపై టీవీ చానళ్ళలో డిబేట్ కూడా నిర్వహిస్తున్నారు. మంగళవారం ఒక టీవీ చానల్లో నిర్వహించిన డిబెట్‌లో అమరావతి జాయింట్ యాక్షన్ కమిటీ (జెఎసి) నాయకుడు కొలికపూడి శ్రీనివాసరావు రాంగోపాల్ వర్మ తల తెస్తే కోటి రూపాయలు నజరానాగా ఇస్తానని ప్రకటించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే సదరు యాంకర్‌ అలాంటి మాటలు వద్దని, విత్‌డ్రా చేసుకోవాలని చెప్పినా శ్రీణివాసరావు వినిపించుకోలేదు. నాకు సమాజం కంటే ఏదీ ఎక్కువ కాదు.. అంటూ ఈ వ్యాఖ్యలు పదేపదే చేశారు. శ్రీనివాసరావు వ్యాఖ్యలపై వర్మ స్పందించారు. కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఈ వ్యాఖ్యలనే తన ఫిర్యాదుగా అధికారికంగా తీసుకోవాలని ఆ వీడియో బైట్ ని ట్యాగ్ చేసి మరీ ఆర్జీవీ ఏపీ పోలీసులకు పంపించారు. అలాగే శ్రీనివాసరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.