TRINETHRAM NEWS

ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు.

ఈ కొత్త చట్టం 6 దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టాన్ని భర్తీ చేస్తుంది.

Trinethram News : ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ఈ రోజు (గురువారం, 13 ఫిబ్రవరి 2025) లోక్‌సభలో కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టారు. దీనికిముందు, 07 ఫిబ్రవరి 2025న, కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లును ఆమోదించింది. కొత్త ఆదాయ పన్ను బిల్లు, ప్రస్తుతం ఉన్న దాదాపు 60 ఏళ్ల నాటి ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో మనుగడలోకి వస్తుంది. పన్ను వ్యవస్థను సరళంగా, పారదర్శకంగా & మరింత ప్రభావవంతంగా మార్చడం కొత్త బిల్లు ఉద్దేశం.

కొత్త ఆదాయ పన్ను బిల్లులోని ప్రతిపాదిత సంస్కరణలు

‘పన్ను సంవత్సరం’ వాడకం: కొత్త బిల్లు ‘అసెస్‌మెంట్ ఇయర్’ అనే పదాల స్థానంలో ‘పన్ను సంవత్సరం’ (Tax Year) పదాలను తీసుకొస్తుంది. పన్ను సంవత్సరం ఏప్రిల్ 01 నుంచి మార్చి 31 వరకు, 12 నెలల కాలం ఉంటుంది.

కొత్త వ్యాపారాలకు పన్ను సంవత్సరం: కొత్త వ్యాపారం లేదా వృత్తిని ప్రారంభించినట్లయితే, దాని పన్ను సంవత్సరం ఆ రోజు నుంచి ప్రారంభమై అదే ఆర్థిక సంవత్సరం చివరిలో ముగుస్తుంది.

మెరుగైన చట్టపరమైన భాష: కొత్త బిల్లు చట్టపరమైన పదాలను సరళీకరించింది, పెద్ద వాక్యాలను కుదించింది & సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా మార్చింది.

పేజీలు కుదింపు: ప్రస్తుత చట్టంలో ఉన్న 823 పేజీలకు బదులుగా, కొత్త ఆదాయ పన్ను బిల్లును 622 పేజీలలో తయారు చేశారు.

ఛాప్టర్లు & సెక్షన్లలో పెరుగుదల: బిల్లులోని అధ్యాయాల సంఖ్య ప్రస్తుత చట్టం & కొత్త బిల్లులో 23గానే ఉంది. కానీ, సెక్షన్ల సంఖ్య 298 నుంచి 536కి పెరిగింది.

షెడ్యూళ్లలో పెరుగుదల: షెడ్యూల్‌ల సంఖ్య ప్రస్తుత చట్టంలో 14 ఉంటే, బిల్లులో 16కు పెరిగింది.

సంక్లిష్ట నిబంధనలు: పాత చట్టంలో ఉన్న సంక్లిష్ట వివరణలు & నిబంధనలను కొత్త బిల్లులో తొలగించారు. దీనివల్ల, వాటిని అర్థం చేసుకోవడం సులభం అవుతుంది.

వర్చువల్ డిజిటల్ ఆస్తులపై కఠినమైన నియమాలు: క్రిప్టో కరెన్సీల వంటి వర్చువల్ డిజిటల్ ఆస్తులను ఇప్పుడు నాన్‌ వెల్లడించని ఆదాయం (undisclosed income) కింద పరిగణిస్తారు.

పన్ను ఎగవేతను అరికట్టడానికి చర్యలు: పారదర్శకతను పెంచడానికి & పన్ను ఎగవేతను అరికట్టడానికి డిజిటల్ లావాదేవీలు, క్రిప్టో ఆస్తులపై కఠినమైన నిబంధనలు అమలు చేస్తారు.

పన్ను చెల్లింపుదారుల చార్టర్: కొత్త బిల్లులో పన్ను చెల్లింపుదారుల చార్టర్ (Taxpayer Charter) కూడా ఉంది. ఇది, పన్ను చెల్లింపుదారుల హక్కులను కాపాడుతుంది, పన్ను పరిపాలనను పారదర్శకంగా చేస్తుంది.

కొత్త ఆదాయ పన్ను బిల్లును ఎందుకు ప్రవేశపెట్టారు?

ప్రస్తుత ఆదాయ పన్ను చట్టం 1961లో అమలులోకి వచ్చింది. ఇది ఆరు దశాబ్దాల నాటిది కావడం వల్ల సాంకేతికంగా సంక్లిష్టంగా & ఆచరణాత్మకంగా ఇబ్బందికరంగా మారింది. దీనిలో కాలానుగుణంగా మార్పులు చేసినప్పటికీ, అది నేటి డిజిటల్ & ఆధునిక ఆర్థిక వ్యవస్థకు పూర్తి అనుకూలంగా లేదు. కాలక్రమేణా భారత ఆర్థిక వ్యవస్థలో అనేక ప్రధాన మార్పులు వచ్చాయి, కానీ పన్ను వ్యవస్థలో ఇప్పటికీ పాత నిర్మాణమే ఉంది. ఈ కారణంగా, పన్ను చెల్లింపుదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. పన్ను వ్యవస్థను సరళీకృతం చేయడానికి, పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడానికి, సమ్మతి ప్రక్రియను సులభంగా మార్చడానికి భారత ప్రభుత్వం కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025ను ప్రవేశపెట్టింది.

పాత చట్టంలోని సమస్యలు

సంక్లిష్టమైన పన్ను నియమాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు

పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో & పాటించడంలో పరిపాలనాపరమైన ఇబ్బందులు పెరిగాయి

పన్ను వివాదాల పరిష్కారం చాలా నెమ్మదిగా, సంక్లిష్టంగా ఉంది.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు తగ్గట్లుగా సరైన నిబంధనలు లేవు

కొత్త పన్ను చట్టం వల్ల సామాన్యులకు ప్రయోజనం ఏంటి?

2025 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను శ్లాబులను ప్రకటించారు, రూ. 12 లక్షల వరకు వార్షిక ఆదాయానికి మిహాయింపు ఇచ్చారు. ఇది, మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం ఇస్తుంది. దీంతో పాటు, పన్ను దాఖలు సులభతరం అవుతుంది, కాగితపు పని తగ్గుతుంది, ఆన్‌లైన్ టాక్స్‌ రిటర్న్ దాఖలుకు ప్రోత్సాహం పెరుగుతుంది. కొత్త పరిష్కార యంత్రాంగం పన్ను వివాదాలను త్వరగా పరిష్కరిస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే, డిజిటల్ చెల్లింపులు & వ్యాపారాలకు మరింత ప్రోత్సహం లభిస్తుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Income Tax Bill
Income Tax Bill