TRINETHRAM NEWS

ఎన్ కౌంటర్ లో మావోయిస్టు నేత హిడ్మా హతం ?

మధ్యప్రదేశ్ లోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్
గతంలో ఎన్నో దాడుల నుంచి తప్పించుకున్న హిడ్మా
ఇప్పటి దాకా ఒక్క గాయమూ కాలేదు.
ఆపరేషన్లలో దిట్టమూడు రాష్ర్టాల పోలీసులకు కొరకరాని కొయ్యగా మారి సవాల్ విసురుతున్న మడావి హిడ్మా ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఎన్ కౌంటర్ లో చనిపోయాడంటూ గతంలోనూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే తాను బతికే ఉన్నానంటూ హిడ్మా పోలీసులకే సవాల్ విసిరాడు. అయితే ఇప్పుడు మరోసారి ఎన్ కౌంటర్ లో చనిపోయాడంటూ వార్తలు వస్తున్నాయి. పక్కా సమాచారం మేరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసుల హాక్ ఫోర్స్ సిబ్బంది బాలాఘాట్ జిల్లాలోని గాధి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖామ్‌కోదాదర్ అటవీ ప్రాంతంలో హిడ్మాను హతమార్చారు. తిరుగుబాటు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలపై మావోయిస్టులు పలుమార్లు దాడులకు పాల్పడ్డానే ఆరోపణలు ఉన్నాయి.
హిడ్మా గోండియా-రాజ్‌నంద్‌గావ్-బాలాఘాట్ (GRB) డివిజన్‌లో (మహారాష్ట్ర, ఎంపీ -ఛత్తీస్‌గఢ్ అంతటా వ్యాపించి) చురుకైన ప్రత్యేక జోనల్ కమి టీ సభ్యుడు (SZCM) రాజేష్ అలియాస్ దామాకు సన్నిహితుడు. హిడ్మా సోదరుడు కూడా మావోయిస్టే. 2023లో ఇప్పటివరకు మధ్యప్రదేశ్‌లో మూడు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు మావోయిస్టులు చనిపోయారు.

ఎవరీ హిడ్మా ?
మావోయిస్టుల్లో ఎందుకు కీలకంగా మారాడు?
స్థానిక పోలీసుల నుంచి కేంద్ర బలగాల దాకా ఎందుకు అతడిని టార్గెట్ చేశాయి?
40 సంవత్సరాల వయసు, బక్క పలచని దేహం..
హిడ్మా ను ఇంతవరకు ఎవరు కూడా ప్రత్యక్షంగా చూడలేదు.. అయితే కొంతమంది రాజకీయ నాయకులు చెప్పిన వివరాల ప్రకారం.. హిడ్మా కు 40 ఏళ్లు ఉంటాయి. బక్కపలచని దేహంతో చాలా మృదువుగా మాట్లాడుతాడు. అతడిని చూస్తే ఇతడేనా ఇంతటి విధ్వంసానికి పాల్పడింది అనిపిస్తుంది.. దాదాపు దశాబ్ద కాలంగా ఇతడు దండకారణ్యంలో ఉంటున్నాడు. మావోయిస్టులు పాల్పడిన అనేక విధ్వంసక కార్యక్రమాలకు రూపకల్పన చేసేది హిడ్మానే అని పోలీసుల విచారణలో తేలింది. హిడ్మా చేసిన ఆపరేషన్లలో అనేక మంది పోలీసుల దుర్మరణం చెందారు. దాదాపు పదికి పైగా దాడులకు కర్త, కర్మ, క్రియ గా వ్యవహరించిన హిడ్మా.. పదుల సంఖ్యలో భద్రత బలగాలను తన దాడుల్లో మట్టుబెట్టాడు. 1996-97 ప్రాంతంలో తన 17 ఏళ్ల వయసులో హిడ్మా మావోయిస్టు పార్టీలో చేరాడు. అతను మాడావి, హిద్మల్లు, సంతోష్ పేర్లతో మావోయిస్టుల్లో పని చేశాడు. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలోని పువర్తి ఇతడి గ్రామం. ఈ గ్రామం నుంచి దాదాపు 40 నుంచి 50 మంది మావోయిస్టులు ఉంటారని ఒక అంచనా. మావోయిస్టు ఉద్యమంలోకి రాకముందు హిడ్మా వ్యవసాయం చేసేవాడని అక్కడి ప్రాంత వాసులు చెబుతుంటారు.
మృధు స్వభావి
హిడ్మా పెద్దగా ఎవరితో మాట్లాడడు. కొత్త విషయాలు నేర్చుకునేందుకు మాత్రం బాగా ఆసక్తి చూపిస్తాడు. ఈ క్రమంలోనే మావోయిస్టు పార్టీతో కలిసి పనిచేసిన ఓ అధ్యాపకుడి ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. తన మాతృభాష కాని హిందీని కూడా ఎంతో ఆసక్తిగా నేర్చుకున్నాడు. అతడు చదువుకున్నది కేవలం ఏడో తరగతి మాత్రమే. హిడ్మా ను 2000 సంవత్సరం ప్రాంతంలో మావోయిస్టులకు అవసరమైన ఆయుధాల తయారీ విభాగంలో వేశారు.. ఆయుధాల తయారీ తో పాటు, మరమ్మతులు కూడా చేసేవాడు. గ్రనేడ్లు, లాంచర్లు స్థానికంగా తయారు చేసేవాడు. 2001-02 ప్రాంతాల్లో దక్షిణ బస్తర్ జిల్లా ప్లటూన్ విభాగంలో ఎదిగాడు. తర్వాత మావోయిస్టు సాయుధ విభాగం (పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) లో చేరాడు. 2001 నుంచి 2007 దాకా అతడు సాధారణ మావోయిస్టు పార్టీ సభ్యుడు గానే ఉన్నాడు. కానీ సల్వాజుడుం ఎదుగుదల హిడ్మా ను మరింత యాక్టివ్ చేసింది. 1990 మధ్యలో ఒక దశలో బస్తర్ ప్రాంతంలో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీ తిరిగి పుంజుకునేందుకు స్థానికుల్లో సల్వాజుడుం పై ఏర్పడిన ప్రతీకారమే ఒక కారణంగా తెలుస్తోంది.
2007 సంవత్సరం మార్చిలో ఉర్పల్ మెట్ట ప్రాంతంలో పోలీసులపై దాడి జరిగింది. దీనికి హిడ్మానే నాయకత్వం వహించాడు. ఈ ప్రమాదంలో దాదాపు 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు మరణించారు. సాధారణంగా మావోయిస్టులు మందు పాతరల మీద ఆధారపడతారు. కానీ తొలిసారిగా ఆ ప్రాంతంలో ఆయుధాలతో తలపడ్డారు. ఏకంగా 24 మంది సీఆర్పీఎఫ్ పోలీసులను పొట్టన పెట్టుకున్నారు. అయితే మావోయిస్టులను మందు పాతరల నుంచి తుపాకీల వైపు మళ్లించడంలో హిడ్మాదే ప్రధాన పాత్ర. అదే కాదు 2008-09 ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏర్పాటుచేసిన ఫస్ట్ బెటాలియన్ కు కమాండర్ అయ్యాడు. ఈ బెటాలియన్ బస్తర్ ప్రాంతంలో చురుగ్గా ఉంటుంది. 2011 దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీలో హిడ్మా సభ్యుడయ్యాడు. 2010 ఏప్రిల్ లో జరిగిన తాడిమెట్ల ఘటనలో 76 మంది పోలీసుల దుర్మరణానికి కారణమయ్యాడు. వాస్తవంగా హిడ్మా నేరుగా తుపాకులు పేల్చేది చాలా తక్కువ. కానీ దగ్గరుండి మిగతా మావోయిస్టులను నడిపిస్తాడు. ఎంతో అవసరం అయితే తప్ప తన దగ్గర ఉన్న తుపాకీ ఉపయోగించడు. ఇప్పటి వరకూ హిడ్మా కు ఒక గాయం కూడా కాలేదు. మావోయిస్టు దళంలో బాగా పేరు వచ్చి దూకుడుగా సాగే మావోయిస్టులు ఎక్కువ కాలం కొనసాగలేరు. వారు చనిపోవడమో లేదా లొంగిపోతుంటారు. కానీ, హిడ్మా అలా కాదు. ఇప్పటికీ మావోయిస్టులకు దిశా నిర్దేశం చేస్తూనే వచ్చాడు. అనేక రకాలైన దాడుల్లో కీలకపాత్ర పోషించాడు. ఆ మధ్య పోలీసులు అతడిని చంపామని ప్రకటించారు. కానీ నేను బతికే ఉన్నానని హిడ్మా ఒక లేఖ ద్వారా ప్రకటించాడు.