TRINETHRAM NEWS

ఏప్రిల్ 16 నుంచి లోక్ సభ ఎన్నికలు? ఎన్నికల సంఘం ఏమన్నదంటే?

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికలు సమీపించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలలో ఈ ఎన్నికలు ఉంటాయని అన్ని పార్టీలూ దాదాపుగా అంచనా వేశాయి. అయితే, ఎన్నికల సంఘానికి చెందిన ఓ సర్క్యులర్ సోషల్ మీడియాకు ఎక్కింది.

అందులో ఎన్నికల తేదీని ఏప్రిల్ 16గా పేర్కొంది. ఢిల్లీలోని 11 జిల్లా ఎన్నికల అధికారులకు ఆ నోటిఫికేషన్ పంపించింది. దీంతో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదలవుతాయా? అనే చర్చ జరిగింది. అయితే, అధికారికంగా ఈసీ ప్రకటించకపోవడంతో గందరగోళం నెలకొంది. ఈ సర్క్యులర్ పై వివరణ ఇవ్వాల్సిందిగా మీడియా ప్రతినిధులు ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు.

ఈ సర్క్యులర్ పై ఢిల్లీ సీఈవో కార్యాలయం ఎక్స్ వేదికపై వివరణ ఇచ్చింది. ఈ తేదీలు కేవలం రిఫరెన్స్ కోసమేనని స్పష్టం చేసింది. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆఫీసు నుంచి ఓ సర్క్యులర్ పై పలు మీడియా సంస్థలు స్పష్టత కోరాయని సీఈవో ఆఫీసు పోస్టులో పేర్కొంది. ఏప్రిల్ 16,2024 తేదీ 2024 లోక్ సభ ఎన్నికలవేనా? అనే ప్రశ్నలు వేశాయని తెలిపింది. ఆ తేదీలు కేవలం అధికారులకు రిఫరెన్స్ కోసం ప్రస్తావించినట్టు వివరించింది. భారత ఎన్నికల సంఘం ఎన్నికల ప్లానర్‌లో ముందుగా నిర్దేశించుకున్న ప్లాన్ ప్రకారం కార్యకలపాలు ముందుకు సాగడానికి ఈ రిఫరెన్స్ తేదీలను పేర్కొన్నామని తెలిపింది.

ప్రతిసారి ఎన్నికల సమయంలో ఈ సంప్రదాయాన్ని ఈసీ పాటిస్తుందని కొన్ని వర్గాలు తెలిపాయి. ముందుగా ఒక రిఫరెన్స్ డేట్ పెట్టుకుని అందుకు అనుగుణంగా ముందస్తు కార్యకలాపాలను ఎన్నికల అధికారులు పూర్తి చేస్తారు.

ఆత్మహత్య చేసుకుంటానని బ్రిడ్జీ ఎక్కిన వ్యక్తి.. బిర్యానీ తినిపిస్తామన్న పోలీసుల హామీతో కిందికి..

లోక్ సభ ఎన్నికల తేదీలు ఇంకా ఖరారు కాకపోయినప్పటికీ ఏప్రిల్ నెలలోనే ఈ ఎన్నికలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్‌లో మొదలై మే నెల వరకు విడతల వారిగా సాగుతాయి. 2019లో ఏడు విడతల్లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన మొదలైన ఎన్నికలు మే 19వ తేదీ వరకు సాగాయి. ఫలితాలను మే 23వ తేదీన వెల్లడయ్యాయి.

అప్పుడు బీజేపీ 303 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 52 సీట్లకే పరిమితమైంది.