TRINETHRAM NEWS

కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్‌లు జనవరి 31, 2024 తర్వాత డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ అవుతాయని ఎన్‌హెచ్‌ఏఐ ప్రకటించింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫాస్టాగ్‌ల (FASTag) ద్వారా టోల్‌ వసూళ్లను మరింత క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోన్న కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. కేవైసీ (KYC) పూర్తిచేయని ఫాస్టాగ్‌లను నిలుపుదల చేసేందుకు సిద్ధమైంది. ఇటువంటి వాటిని జనవరి 31, 2024 తర్వాత బ్యాంకులు డీయాక్టివేట్‌ లేదా బ్లాక్‌ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది.

‘ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నా.. కేవైసీ పూర్తి చేయకపోతే జనవరి 31, 2024 తర్వాత వాటిని బ్యాంకులు డీయాక్టివేట్‌/బ్లాక్‌లిస్ట్‌ చేస్తాయి. ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు యూజర్లు తమ ఫాస్టాగ్‌లకు కేవైసీ పూర్తి చేసుకోవాలి’ అని ఎన్‌హెచ్‌ఏఐ వెల్లడించింది. అదనపు సమాచారం కోసం సమీపంలోని టోల్‌ప్లాజాలు (Toll Plaza) లేదా సంబంధిత బ్యాంకు కస్టమర్‌కేర్‌ నంబర్‌లను సంప్రదించాలని సూచించింది. ఇదేకాకుండా కొన్నిసార్లు వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం ముందుభాగంలో పెట్టకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని.. దాంతో టోల్‌ప్లాజాల్లో ఆలస్యంతోపాటు ప్రయాణికుల అసౌకర్యానికి కారణమవుతోందని పేర్కొంది.

వాహనదారులు ఒకే ఫాస్టాగ్‌ను అనేక వాహనాలకు ఉపయోగించడం, ఒకే వాహనానికి పలు ఫాస్టాగ్‌లను లింక్‌ చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నట్లు గుర్తించింది. ఇటువంటి వాటిని ప్రోత్సహించకుండా ఉండేందుకు ఒకే వాహనం-ఒకే ఫాస్టాగ్‌ (One Vehicle, One FASTag) విధానానికి ఎన్‌హెచ్‌ఏఐ చర్యలు చేపట్టింది.