Trinethram News : రాముడు మాకు కూడా దేవుడే. రాముడికి మొక్కుదాం.. ఓటుతో ఎన్నికల్లో బీజేపీనీ తొక్కుదాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. ఘట్కేసర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు కేటీఆర్.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన ఖర్మ మాకు లేదు అన్నారు కేటీఆర్. ఫోన్ ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ.. మంచినీళ్ల మీద పెట్టమని హితవు పలికారు. రైతు బంధు, దళిత బంధు, రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీరలు సహ అన్ని రద్దు చేశారని విమర్శించారు. రాహుల్ భారత్ జోడో యాత్ర అని దేశమంతా తిరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ నా పెద్దన్న అంటారని ఎద్దేవా చేశారు.
లిక్కర్ స్కామ్ జరగలేదని రాహుల్ అంటే లేదు లిక్కర్ స్కామ్ జరిగిందని రేవంత్ అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్లో రాహుల్, రేవంత్ రెండు నాలుకలు అని విమర్శించారు.ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కేసులు తప్పించుకోవడం కోసం బీజేపీలో చేరుతారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క సీటు కూడా రాదన్న రేవంత్ రెడ్డి తాను విసిరిన ఛాలెంజ్ పట్ల సప్పుడు చేయలేదన్నారు. ఈటలకు ఓటు వేసినా ఇక్కడ ఉండరు.. హుజురాబాద్ వెళ్ళిపోతారని విమర్శనాస్త్రాలు సంధించారు. బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచిన లోకల్ అభ్యర్థి రాగిడిని గెలిపించాలని కోరారు. రాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం.. అంటూ నినాదాలు చేశారు. రాముడి పేరు చెప్పుకుని రాజకీయం చేసే బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్, ప్రధాని మోదీ ఇద్దరూ కలిసి తెలంగాణను ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.