TRINETHRAM NEWS

కత్తులు దూసిన కోళ్లు.. రూ.లక్షల్లో చేతులు మారిన నగదు

అమరావతి

అధికారమే అండగా.. కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు ప్రారంభమయ్యాయి..

వీటిలో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రముఖులు తరలివచ్చారు. వైకాపా నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా పందేలు సాగుతున్నాయి..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో తీర ప్రాంతం, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా బరులు వెలిశాయి. గుడివాడ, పెనమలూరు, కైకలూరు, గన్నవరం, ఎన్టీఆర్‌ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. పంట పొలాలు, మామిడితోటలను కోండిపందేలకు బరులుగా మలిచారు. రాత్రిపూట సైతం పందేలు నిర్వహించేందుకు వీలుగా జనరేటర్లు, ఫ్లడ్‌ లైట్లు ఏర్పాటు చేశారు. కోడిపందేలు నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి..

సినిమా సెట్టింగ్‌లను తలపించేలా ఏర్పాట్లు..

సంక్రాంతి సంబరాల పేరుతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపురంలో ఏటా మాదిరిగానే భారీ స్థాయిలో కోడిపందేలు, కోతముక్క, ఇతర జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. 16వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 25 ఎకరాల ప్రైవేటు స్థలంలో ప్రత్యేకంగా బరులు, వేదికలు ఏర్పాటు చేశారు. మూడురోజుల పాటు జూద శిబిరాలు కొనసాగేలా సకల సౌకర్యాలు కల్పించారు. సీఎం జగన్‌, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ వైకాపా నాయకుల చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహిళలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేల సంఖ్యలో వచ్చే జూదరుల కోసం విశాలమైన పార్కింగ్‌ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు. సినిమా సెట్టింగ్‌లను తలపించేలా స్వాగత ద్వారాలు, బౌన్సర్లు, సందర్శకులకు పాస్‌లు, ఆటగాళ్లకు టోకెన్లు, చేతి కంకణాల వంటి ఏర్పాట్లతో హంగామా చేశారు. పందేల మొదటి రోజే రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. పందేలను తిలకించేందుకు వస్తున్న వాహనదారులతో చెన్నై-కోల్‌కతా హైవేతో పాటు సర్వీసు రోడ్లపై ట్రాఫిక్‌ రద్దీ నెలకొంది..