TRINETHRAM NEWS

దిల్లీ: మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం కోర్టు ముందు హాజరయ్యారు. ఈ కేసులో ఆయనకు బెయిల్‌ లభించింది. రూ.15000 బాండ్‌, రూ.లక్ష పూచీకత్తుతో న్యాయస్థానం దీన్ని మంజూరు చేసింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్‌ వెళ్లిపోయారు.
మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఇప్పటి వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు పంపిన విషయం తెలిసిందే. వాటిని ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలోనే గత నెల ఈడీ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై అప్పుడు విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశించింది. ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్‌గా హాజరైన సీఎం.. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.
ఈ అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని పిలవగా.. సీఎం గైర్హాజరయ్యారు. అయితే, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాత వర్చువల్‌గా హాజరవుతానని షరతు విధించారు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించగా.. మార్చి 16వ తేదీన తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. దానిలో భాగంగానే ఈ రోజు ఆయన న్యాయస్థానానికి వచ్చారు.
కేజ్రీవాల్‌పై మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈడీ చేసిన రెండు ఫిర్యాదుల్లో ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అనంతరం న్యాయమూర్తి అనుమతితో సీఎం కోర్టు నుంచి వెళ్లిపోయారు.