CM YS Jagan Comment : జగన్ పోరాటం దక్కేనా విజయం..
మరోసారి పవర్ కోసం ప్రయత్నం
ఏపీ విడి పోయాక అనూహ్యంగా తలపండిన రాజకీయ పార్టీ తెలుగుదేశంకు చుక్కలు చూపించాడు వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి. అనూహ్యంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తనకు ఎదురే లేదని నిరూపించాడు. పాదయాత్ర సందర్బంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నం చేశారు. అప్పుల భారాన్ని తమపైకి నెట్టి వేసినా ఆయన మౌనంగా భరిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పులతోనే అభివృద్ది అనే దానిని నినాదంగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కింది. ఆయన హయాంలోనే ప్రపంచ బ్యాంకు సంస్కరణలు ఉమ్మడి ఏపీలో అమలు అయ్యాయి. సెజ్ లు ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకు వచ్చాయి. ఇవాళ భూమి అనేది అన్నింటికంటే విలువైనదిగా మారి పోయింది. ఈ తరుణంలో పవర్ లోకి వచ్చిన జగన్ రెడ్డి పేదలు, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలపై ఫోకస్ పెట్టారు. ప్రత్యేకించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలను అక్కున చేర్చుకునే ప్రయత్నం చేశారు. ఇక కేబినెట్ లో సైతం వారికి ప్రయారిటీ ఇస్తూ వచ్చారు. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా ఎక్కడా తగ్గలేదు.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పెద్ద ఎత్తున ఫలితాలు వచ్చాయి. ఈ తరుణంలో కొత్తగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో పడ్డారు. ఇప్పటి వరకు 95 శాతం అమలు చేశానని ఆయన వివరాలను ప్రకటించారు. అయితే ప్రతిపక్షాల నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి దేవి ఎంతగా ఆరోపణలు గుప్పించినా ఎక్కడా చెక్కు చెదర లేదు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో పోస్టుమార్టం మొదలు పెట్టారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు. మరో వైపు టీడీపీ, జనసేన కలిసే బరిలోకి దిగుతామని ప్రకటించాయి. ఈ తరుణంలో రెండోసారి అధికారం లోకి రావాలని కంకణం కట్టుకున్నారు జగన్ రెడ్డి. ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను, నేతలను సమాయత్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకు వచ్చాడు.
అంతే కాదు వై నాట్ 175 అనే స్లోగన్ తో ముందుకు వెళుతున్నాడు. తాను ఇచ్చిన హామీలు ఎక్కడ అమలు కాలేదో చెప్పాలంటూ సవాల్ విసిరారు. అయితే ఉన్నట్టుండి ఉద్యోగులు, కాంట్రాక్టు కింద పని చేస్తున్న వారు రోడ్డెక్కడం , ఆందోళన బాట పట్టడం, పోరాటాలు చేయడం ఒకింత ఇబ్బంది కరంగా మారింది. ఇటు అసెంబ్లీలో అటు లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ. ఈసారి కూడా అంతకంటే ఎక్కువ సీట్లు రావాలని టార్గెట్ డిసైడ్ చేశాడు జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం గెలుపొందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలలో చాలా మందికి టికెట్ నిరాకరించడం ఒకింత ఇబ్బందికరంగా మారింది. గెలిచే వారికే టికెట్లు ఉంటాయని మిగతా వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని ప్రకటించారు. విపక్షాలన్నీ ఒక వైపు జగన్ రెడ్డి ఒక్కడు ఒక వైపు ఉండడంతో ఈసారి ఎన్నికలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. ఈసారి గెలుపు తాను ఊహించిన దానికంటే సులువేమీ కాదని తనకు తెలుసు. ఒక రకంగా అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలు జగన్ మోహన్ రెడ్డి పాలనకు అగ్ని పరీక్ష అని చెప్పక తప్పదు.