మహాకుంభ మేళా అంతరిక్షం నుంచి ఎలా కనిపిస్తుందంటే.. ఫొటోలు రిలీజ్ చేసిన ఇస్రో
ప్రయాగ్ రాజ్ లో భారీ ఎత్తున్న నిర్మాణాలు చేపట్టినట్లు చిత్రాల్లో వెల్లడి
గతేడాది ఏప్రిల్ లో ఖాళీగా కనిపించిన ప్రాంతంలో డిసెంబర్ లో వెలసిన టెంట్లు
ఈ ఏడాది జనవరిలో భారీగా పెరిగిన నిర్మాణాలు
Trinethram News : పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. 45 రోజుల పాటు జరిగే కుంభమేళాలో దాదాపు 40 కోట్ల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. ఇందు కోసం ఉత్తరప్రదేశ్ సర్కారు భారీ ఎత్తున్న ఏర్పాట్లు చేసింది. టెంట్ సిటీని నిర్మించి భక్తులకు వసతి సదుపాయం కల్పించింది. సాధువుల నుంచి సామాన్యుల దాకా టెంట్లలో ఉంటున్నారు.
వీటితో పాటు భక్తుల కోసం ప్రభుత్వం ఇతరత్రా ఏర్పాట్లు చేసింది. వీటన్నింటికోసం చేపట్టిన నిర్మాణాలతో మహాకుంభ్ నగర్ ఓ భారీ నగరాన్ని తలపిస్తోంది. మహాకుంభమేళాకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తాజాగా పలు చిత్రాలను విడుదల చేసింది. అంతరిక్షం నుంచి కుంభమేళా ఏరియాను ఉపగ్రహాలు తీసిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఈ ఫొటోల ప్రకారం.. గతేడాది ఏప్రిల్ లో ఈ ఏరియా నిర్మానుష్యంగా, బీడు భూములను తలపించేలా కనిపించింది. డిసెంబర్ 22న తీసిన ఫొటోలలో ఈ ప్రాంతంలో నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి. టెంట్ల నిర్మాణం గత డిసెంబర్ లోనే మొదలైంది. తాత్కాలికంగా శివాలయ పార్కును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో భారతదేశ పటం కనిపించడం విశేషం. ఈ నెల 10న తీసిన ఫొటోలలో మహాకుంభ్ నగర్ లో నిర్మాణాలు భారీగా పెరిగిపోవడం చూడొచ్చు.
మూడు రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో జనవరి 10 నాటికే సాధువులతో పాటు సామాన్యులు పెద్ద సంఖ్యలో త్రివేణీ సంగమం వద్దకు చేరుకున్నారు. కాగా, మహాకుంభ్ నగర్ లో దాదాపు 1.50 లక్షల టెంట్లను నిర్మించామని, అందులో 3 వేల కిచెన్ లు, అదనంగా 1.45 లక్షల రెస్ట్ రూంలు, 99 పార్కింగ్ లాట్లను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App