TRINETHRAM NEWS

Chandrababu: నేను పట్టిసీమ కట్టాననే నీటిని విడుదల చేయలేదు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్

అమరావతి: మిచౌంగ్ తుఫాను వల్ల రైతులకు చాలా నష్టం సంభవించిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ..15 జిల్లాల్లో 25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు..

తుపాను హెచ్చరికలు చేసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని విమర్శించారు. హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటే పంట నష్టం, ప్రాణ నష్టం తగ్గించొచ్చన్నారు. పంట నష్టాన్ని నివారించే పరిస్థితులున్నా.. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పట్టిసీమ నీటిని విడుదల చేసి ఉంటే పంట ముందుగానే చేతికి వచ్చేదన్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో వచ్చే తుపానుల బారి నుంచి పంటలు కాపాడుకునేవాళ్లమన్నారు. తాను పట్టిసీమ కట్టానని జగన్ నీటిని విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు..

రైతులు ప్రభుత్వాన్ని తంతారని భయంతో విధిలేని పరిస్థితుల్లో పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేశారని.. కానీ అప్పటికే ఆలస్యమైందన్నారు. పంటలు తుపాను బారిన పడ్డాయన్నారు. ప్రాజెక్టుల మెయిన్టెన్సును పట్టించుకోవడం లేదని.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్లిందని తెలిపారు. పులిచింతల, గుండ్లకమ్మ ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయాయన్నారు. గేట్ల రిపేర్లు చేయడం లేదని.. నిర్వాహణ కూడా అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యలు చేశారు. రిపేర్లు చేయడానికి కాంట్రాక్టర్లు కూడా ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పంట కాల్వల నిర్వహణ సరిగా చేయడం లేదన్నారు. సీఎం కానీ.. మంత్రులు కానీ కనీస చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. వ్యవస్థలు నాశనం చేశారని చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు..