TRINETHRAM NEWS

Trinethram News : Delhi Excise Policy Case: లిక్కర్‌ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించేనా? తీర్పు రిజర్వ్‌ చేసిన కోర్టు

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌లో పెట్టింది న్యాయస్థానం. గురువారం మధ్యాహ్నం తీర్పును వెల్లడించబోతున్నారు. కేజ్రీవాల్‌ తరపున లాయర్‌ సింఘ్వీ వాదనలు విన్పించారు. తనను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకోవడానికే ఈడీ అరెస్ట్‌ చేసిందని కోర్టుకు తెలిపారు కేజ్రీవాల్‌. లిక్కర్‌ స్కాంలో కేజ్రీవాల్‌ను విచారించకుండానే నేరుగా అరెస్ట్‌ చేశారన్నారు సింఘ్వీ. ఢిల్లీ ముఖ్యమంత్రిని దారుణంగా అవమానించాలన్న లక్ష్యం తోనే అరెస్ట్‌ చేశారన్నారు. ఆప్‌ను సర్వనాశనం చేయడమే ఈడీ లక్ష్యమన్నారు. లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన కేజ్రీవాల్‌కు ఈనెల 15వ తేదీ వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది రౌస్‌ అవెన్యూ కోర్టు.

అయితే ఈడీ తరపున వాదించిన అడిషినల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు లిక్కర్‌ కేసు విచారణ ప్రాథమిక దశలో ఉందని, కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వవద్దని హైకోర్టులో వాదించారు. నేరం ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. లిక్కర్‌ స్కాంలో డిజిటల్‌ ఎవిడెన్స్‌ను కేజ్రీవాల్‌ ధ్వంసం చేశారని ఆరోపించారు. లిక్కర్‌ స్కామ్‌లో నగదు లావాదేవీలు జరిగినట్టు తమ దగ్గర ఆధారాలు ఉన్నట్టు ఈడీ తెలిపింది. లిక్కర్‌ స్కాంలో ఆమ్‌ ఆద్మీ పార్టీని కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశముందని ఏఎస్‌జీ ఎస్వీ రాజు తెలిపారు.

నిందితుల వాట్సాప్‌ చాట్స్‌ ఉన్నట్టు వెల్లడించారు. మరోవైపు లిక్కర్‌ స్కాంలో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో తిహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌. ఆప్‌ కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. సంజయ్‌సింగ్‌ లాగే త్వరలోనే కేజ్రీవాల్‌, మనీష్‌ సిసోడియాకు బెయిల్‌ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆప్‌ కార్యకర్తలు.