ఆయనో మహానేత.. ఏనుగుల
త్రినేత్రం న్యూస్,మార్కాపురం , ప్రకాశం జిల్లా : ఆయనో మహానేత….నిస్వార్ధ జీవి.. ఆయనకు పేదలంటే ప్రాణం……. దేవరాజు గట్టు నుంచి ..కర్నూలు….. అక్కడి నుంచి గుంటూరు….. అక్కడి నుంచి విజయవాడకు …మార్కాపురం వరకు ..సాగిన జీవన యాత్ర.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో జన్మించారు… కామ్రేడ్ ” ఏనుగుల పుల్లయ్య “. దేవరాజు గట్టు గ్రామ కాపురస్తుడైన ఏనుగుల గురవయ్య పదకొండవ సంతానం శ్రీ ఏనుగుల పుల్లయ్య. ఆయన హై స్కూల్ స్థాయి వరకు వేములకోటలో విద్యాభ్యాసం చేశారు. అనంతరం కళాశాల స్థాయి విద్యను గుంటూరులోని ఏసీ కళాశాలలో విద్యాభ్యాసం చేశారు. అప్పట్లో ఒంగోలు దగ్గర గల కొత్తపట్నం నుంచి కర్నూలుకు ఎద్దుల బండ్ల పైన ఉప్పు ను తీసికెళ్ళి వ్యాపారం సాగించేది ఆయన కుటుంబం. అప్పటి ఆంధ్ర రాష్ట్ర రాజధాని కర్నూలులో ఆంధ్రరాష్ట్ర సచివాలయం ఉండేది. అక్కడి ఉద్యోగుల పరిచయంతో సచివాలయంలో ఉద్యోగిగా ఆయన జీవనయాత్ర సాగించారు.
ఆనాటి కాలంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు అనే రెండు పార్టీలు మాత్రమే బలంగా ఉండేవి. అక్కడే కర్నూల్ లోని కమ్యూనిస్టు ఉద్దండులతో పరిచయాలు ఏర్పడ్డాయి. కొద్ది సంవత్సరాలు కర్నూల్లోని సచివాలయంలో పనిచేసిన తర్వాత కమ్యూనిస్టు నాయకుల సూచన మేరకు గుంటూరులోని రైల్వే డిపార్ట్మెంట్ లోని అర్ ఎం ఎస్ ఉద్యోగిగా చేరారు. తాను పనిచేస్తున్న ఆర్ ఎం ఎస్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల యూనియన్ కు బలం చేకూర్చారు. ఆ తర్వాత తిరిగి కమ్యూనిస్టు నాయకుల సూచన మేరకు విజయవాడలోని పోస్టల్ డిపార్ట్మెంట్లో కి ప్రమోషన్ మీద బదిలీ అయ్యారు. అక్కడి కిందిస్థాయి ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగులను కలుపుకుంటూ అధికారిగా కొనసాగారు.
తన కుటుంబం సైతం విజయవాడలోనే ఉంచారు. అలా విజయవాడలో పనిచేస్తున్న క్రమంలో ఎలాంటి లాభాపేక్ష లేని కమ్యూనిస్టు పార్టీని మార్కాపురంలో ఏర్పాటు చేయాలని అక్కడి కమ్యూనిస్టు ఉద్దండులు సూచించారు. దీంతో తన పోస్టల్ ఉద్యోగానికి ఏడు సంవత్సరాలకు ముందుగానే 1985 లో రాజీనామా చేసి (వాలంటీర్ రిటైర్మెంట్ ఇచ్చి) మార్కాపురం డివిజన్లోనే ప్రజాశక్తి పేపర్ లో ప్రధమ విలేఖరిగా చేరారు. అలా విలేకరిగా చేరి తెల్లవారుజామున పేపర్ ను పాఠకులకు అందించేవారు. మిగిలిన సమయంలో తన వద్దకు వచ్చిన కష్టజీవుల సమస్యలను పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. రిక్షా యూనియన్, ముఠా వర్కర్స్ యూనియన్, పలకల ఫ్యాక్టరీ వర్కర్స్ యూనియన్, పోస్టల్, ఎల్ఐసి, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ అండ్ బి, వీఆర్వో, మున్సిపల్, ఉపాధ్యాయ, అంగన్వాడి, ఆర్టీసీ ఎస్.డబ్ల్యూ.ఎఫ్ వంటి ఉద్యోగుల యూనియన్ లను ఏర్పాటు చేసి వారి సమస్యలపై నేనున్నానంటూ ఉద్యమించి పరిష్కరించేవారు. తాను ముసలివారైనా కళాశాల విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాల్లో ముందుండి నడిపించారు. తనకు వచ్చే పెన్షన్ కొంత భాగం తన వెంట నడిచిన విద్యార్థుల చదువులకు తోడ్పాటు అందించేందుకు వెచ్చించారు.
మిగిలిన భాగాన్ని పార్టీ కార్యక్రమాల కోసం యూనియన్ల నిర్వహణ కోసం వెచ్చించేవారు. అదేవిధంగానే మార్కాపురం డివిజన్లోని మండలాల్లోనీ వెలుగొండ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని అనేక ఉద్యమాలు చేశారు. అలాగే పేద ప్రజలకు రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల పంపిణీ కోసం పేదలను కూడగట్టి అనేక ఉద్యమాలు చేపట్టారు. ఇలా నాగులవరం రోడ్డులోని దాదాపు 1998లో 42 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. 1999లో దోర్నాల పట్టణంలో ఏర్పాటు చేసిన సుందరయ్య కాలనీలోని వందలాది పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇప్పించి అక్కడి ప్రజల ఆదరాభిమానాలు పొందారు. తదనంతరం నివాస స్థలం లేని పేద ప్రజలందరితో కలిసి మార్కాపురం పట్టణంలో భగత్ సింగ్ కాలనీ, సుందరయ్య కాలనీ, రాజ్యలక్ష్మి నగర్, ఒంటెద్దు బండ్ల కాలనీ లను ఏర్పాటు చేశారు.
విద్యార్థులలో, ఉద్యోగులను, పేదప్రజలలో మంచి స్థానం సాధించారు. సిపిఎం పార్టీని మార్కాపురం రెవిన్యూ డివిజన్లోని 12 మండలాలతో పాటు కందుకూరు రెవిన్యూ డివిజన్ లోని తర్లుపాడు మండలంలో కూడా పార్టీని, సంఘాలను పటిష్టపరిచారు. అనేకమంది నాయకులను కార్యకర్తలను తయారు చేశారు. ఎలాంటి స్వార్థం లేకుండా పేదలు, ఉద్యోగుల కోసం నిరంతరం ఎనలేని సేవలందించిన ఆయనకు గుర్తుగా అభిమానులు మార్కాపురం కోర్టు సెంటర్లోని పోస్టాఫీసు వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 న ఆయన సేవలను స్మరించుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App