TRINETHRAM NEWS

Former Minister Harish Rao

Trinethram News : రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం.

ఒక్కరోజే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో పసికందు మృతదేహాన్ని కుక్కలు పీక్కతినడం, హైదరాబాద్ శివారులోని నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో మరో దివ్యాంగ చిన్నారి మర్మాంగాలపై కుక్కల దాడి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నాలుగేళ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయాలపై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.. వంటి హృదయవిధారక ఘటనలు జరగటాన్ని చూసి కూడా ప్రభుత్వం చలించకపోవడం అమానవీయం.

బతికున్న మనుషులను సైతం కుక్కలు చంపి పీక్కుతిన్న సంఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
మరోవైపు చిన్నారులపై కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి.

రాష్ట్రంలో కుక్కల దాడుల్లో మనుషులు చనిపోవడం అనేది ఒక సాధారణ అంశంగా ప్రభుత్వం భావిస్తుండటం దుర్మార్గం. కుక్క కాటు కేసులు నమోదైన మొదట్లోనే తగిన చర్యలు తీసుకొని ఉంటే గడిచిన ఎనిమిది నెలల కాలంలో 343 కుక్కకాటు సంఘటనలు జరిగి ఉండేవి కావు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు.

రాష్ట్రంలో 3,79,156 వీధి కుక్కలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల హైకోర్టుకు తెలిపింది. కానీ వీటి సంఖ్య ఇంతకు రెట్టింపు ఉంటుంది అని ప్రజలు భావిస్తున్నారు.

గ్రామాల్లో, పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిలిపివేయడం వల్ల పారిశుధ్య నిర్వహణ పడకేసింది. చెత్తాచెదారం పేరుకుపోయిన ప్రాంతాల్లో వీధికుక్కల బెడద మరింత ఎక్కువైంది.

మున్సిపల్ టౌన్లలో పురపాలక శాఖ వైఫల్యం వల్ల వీధి కుక్కల నియంత్రణ లేకుండా పోయింది.

అంతే కాక సరైన నిధుల కేటాయింపు లేక కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసే వ్యవస్థ కూడా అసలు సరిగా పనిచేయడం లేదు. దీనివల్ల వీధి కుక్కల సంతానం విపరీతంగా పెరిగిపోయింది.

ఇప్పటికే పలుమార్లు హైకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసినా ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్ర వదలడం లేదు.

ప్రభుత్వం వెంటనే కుక్కకాటు దాడులు అరికట్టే విధంగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన కుక్కకాటు సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. (343 కుక్కకాటు ఘటనల వివరాలను అందిస్తున్నాం) ప్రాణాలు కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నష్టపరిహారం చెల్లించాలి.

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కుక్కకాటు బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూడాలి, యాంటీ రేబీస్ మందులు అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలి.

దీంతోపాటు వీధి కుక్కల నియంత్రణ కోసం సమగ్ర కార్యాచరణ అమలు చేయాలి. క్రమం తప్పకుండా మానిటర్ చేస్తూ సంఖ్య పెరగకుండా చూసుకోవాలి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Minister Harish Rao